నకిలీ వ్యక్తులతో రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:32 AM
: చనిపోయిన వ్యక్తుల పేరుతో 5 సెంట్ల స్థలాన్ని నకిలీ వ్యక్తులు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
మృతుల పేరుతో అక్రమం
చేతులు మారిన రూ.18లక్షలు
ఐదుగురి అరెస్టు
కోడుమూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): చనిపోయిన వ్యక్తుల పేరుతో 5 సెంట్ల స్థలాన్ని నకిలీ వ్యక్తులు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కథ బెడిసికొట్టి చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలు అయ్యారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో సీఐ ఎం.తబ్రేజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు పట్టణానికి చెందిన అన్నదమ్ములు కాకే నారాయణ, కాకే నాగరాజు 1984లో కోడుమూరు సమీపంలోని 100 సర్వే నంబర్‌లో ఐదు సెంట్ల స్థలాన్ని కొన్నారు. అనారోగ్యంతో 2013లో నారాయణ, 2014లో నాగరాజు మృతి చెందారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన సోమేష్, కోడుమూరు పట్టణానికి చెందిన బోయ మధు, కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన రాజోలి గిడ్డయ్య కలిసి చనిపోయిన అన్నదమ్ముల పేర్లు ఉన్న వ్యక్తుల పట్టుకొని వారి ఐదు సెంట్ల స్థలాన్ని కాజేయాలని ప్రథకం వేశారు. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామానికి చెందిన బోయ నారాయణ, నాగరాజు అనే వ్యక్తులను వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అధికారు లతో కుమ్మకై ఐదు సెంట్ల స్థలాన్ని 2023లో ఆ నకిలీ వ్యక్తులతో రిజిస్టర్ చేయించారు. ఐదు సెంట్ల ప్లాట్‌ను అమ్మగా వచ్చిన రూ.18లక్షలను అందరూ సమానంగా పంచుకొన్నారు. చనిపో యిన కాకే నారాయణ భార్య లీలావతి భర్త కొనుగోలు చేసిన స్థలాన్ని చూసేందుకు ఇటీవల కోడుమూరుకు వచ్చింది. ఆ సందర్భంగా అసలు విషయం బైటపడింది.
లీలావతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ డివై.స్వామి విచారణ చేపట్టి బుధవారం సోమేష్, మధు, రాజోలి గిడ్డయ్య, బోయ నారాయణతో పాటు ఇందుకు సహకరించిన మాదాసు నాగేష్‌ను అరెస్టు చేశారు. నిందితులు నాగరాజు, విష్ణు పరారిలో ఉన్నారు. ఈ కేసులో మరి కొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ చెప్పారు.