Share News

గుట్టుచప్పుడుగా..

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:33 AM

కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఓ అధికారి డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడు. బేరం కుదిరితే అసలు యజమానులు లేకుండా దర్జాగా రిజిస్ర్టేషన్‌ చేస్తారు

గుట్టుచప్పుడుగా..
కర్నూలు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

అవినీతికి అడ్డాగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

యజమానులు లేకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు

డాక్యుమెంట్‌ రైటర్‌తో కుమ్మక్కైన ఓ అధికారి

కల్లూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఓ అధికారి డాక్యుమెంట్‌ రైటర్లతో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడు. బేరం కుదిరితే అసలు యజమానులు లేకుండా దర్జాగా రిజిస్ర్టేషన్‌ చేస్తారు. అవినీతికి అడ్డాగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం మారింది. కర్నూలు ఇన్‌చార్జ్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కర్నూలు మండలం పసుపల గ్రామ పంచాయతీ సోమప్ప కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి చెందిన దాదాపు 30ప్లాట్లు అక్రమ రిజిస్ర్టేషన్‌ జరగడమే ఇందుకు నిదర్శనం. సొసైటీ సభ్యులకు తెలియకుండా 30ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ చేయడం వెనక పెద్దకుట్ర దాగి ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తం 5 డాక్యు మెంట్లు జీపీఏ చేయడంతో కుట్ర వెలు గులోకి రాగా 25సెంట్ల పార్క్‌తో పాటు దాదాపు 25ప్లాట్లు మొత్తం 30 రిజిస్ర్టేషన్లు జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గత సోమవారం కలెక్టర్‌, ఎస్‌పీలకు ఫిర్యాదు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

1997లో పాణ్యం సిమెంట్స్‌ యాజమాన్యం..

పాణ్యం సిమెంట్స్‌ యాజమాన్యం 1997లో తమ ఉద్యోగులకు నివాస భద్రత కల్పించాలనే లక్ష్యంతో కర్నూలు మండలం పసుపలలోని సర్వేనెంబరు 303, 304, 306లో కొంత భూమి కొనుగోలు చేసింది. అనంతరం సోమప్ప కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసింది. మొత్తం 75ప్లాట్లు వేసి రెండు ఎల్‌పీ నెంబర్లు 57-99, 58-99 తీసుకున్నారు. ఉద్యోగులు తమ జీతాలనుంచి నెలవారీ కంతులు చెల్లించి ప్లాట్లు సొంతం చేసుకున్నారు. దాదాపు 75మంది ఉద్యోగులు తమ జీతంలో దాచుకున్న ఒక్కో రూపాయి తో ప్లాట్లను కొని తమపేరుపై రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. కంపెనీ మూతపడి దాదాపు 75-80 ఏళ్ల వయస్సు పైబడ్డ వారంతా తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపల చదువులు, పెళ్లిళ్లు, సొంత నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ఆశలు అడియాశలు అయ్యాయని ఆందోళన చెందుతున్నారు.

అధికారుల తీరుపై ఆగ్రహం

రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారుల తీరుపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడాక్యుమెంట్‌ రైటర్‌ చెప్పు చేతుల్లో నిబంధనలకు నీళ్లొదిలి అక్రమ రిజిస్ర్టేషన్‌ చేసిన ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్‌పీ నెంబరులోని ప్లాట్లపై ఒకే వ్యక్తి పేరుతో అధిక రిజిస్ర్టేషన్లు ఎలా చేశారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఆందోళనకు సిద్ధం

సోమప్ప కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఉద్యోగులకు చెందిన ప్లాట్లను అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయడంతో బాధితులు ఆగ్రహంగా ఉన్నారు. కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌తో రెండు రోజులుగా వాగ్వాదానికి దిగి తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని భీష్మించారు. సోమవారం సొసైటీ సభ్యులు కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధ్దమవుతున్నారు.

న్యాయం జరిగే వరకు పోరాటం

మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మా ప్లాట్లు అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయడంపై సోమవారం ధర్నా చేయనున్నాం. ఒక్క వ్యక్తితో సబ్‌ రిజిస్ర్టార్‌ ఎలా రిజిస్ర్టేషన్‌ చేస్తాడు. డాక్యుమెంట్లు రద్దు చేసి న్యాయం జరిగే వరకు విశ్రమించం. సోమప్ప, అధ్యక్షుడు, కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ హౌస్‌ సొసైటీ

నా దృష్టికి రాలేదు

కర్నూలు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ర్టేషన్లు నాదృష్టికి రాలేదు. నేను సెలవులో ఉన్నాను. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇదిలా ఉండగా జిల్లా రిజిస్ర్టార్‌ అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. -విజయలక్ష్మి, ఇన్‌చార్జి డీఐజీ, స్టాంపులు రిజిస్ట్రేన్‌, కర్నూలు

Updated Date - Dec 28 , 2025 | 12:33 AM