నకిలీ ఎరువుల దందా
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:28 AM
ఖరీఫ్ వచ్చిందంటే చాలు ఎరువుల దుకాణదారుల దందా మొదలవుతుంది. ఎరువుల వ్యాపారుల వ్యవహారంలోని మతలబు ఎవరికీ అంతు చిక్కదు. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఎరువులను పక్క రాష్ట్రం నుండి మరో రాష్ర్టానికి తరలించకూడదు. అలాంటిది ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా ఏకంగా కర్ణాటక నుంచి నకిలీ ఎరువులను తెచ్చి రైతులకు అంటగడుతున్నారు.
కర్ణాటక నుంచి దిగుమతి
కంపెనీదారులకు ఫిర్యాదు చేసిన రైతులు
దుకాణ యజమానిని నిలదీసిన కంపెనీ ఉద్యోగులు
నకిలీ ఎరువును సీజ్ చేసిన అధికారులు
ఆదోని రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ వచ్చిందంటే చాలు ఎరువుల దుకాణదారుల దందా మొదలవుతుంది. ఎరువుల వ్యాపారుల వ్యవహారంలోని మతలబు ఎవరికీ అంతు చిక్కదు. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఎరువులను పక్క రాష్ట్రం నుండి మరో రాష్ర్టానికి తరలించకూడదు. అలాంటిది ఎలాంటి ఇన్వాయిస్ లేకుండా ఏకంగా కర్ణాటక నుంచి నకిలీ ఎరువులను తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. నిబంధనల ప్రకారం అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు కార్యాలయాలకు పరిమితం కావడంతోపాటు ఎరువుల దుకాణదారులతో సత్సంబంధాలతో ముందుకు పోతున్నారు. దీంతో రైతులే ఎరువులు ఏవి నకిలీవి, ఏవి మంచివని గుర్తుపట్టి ఎరువుల యజమానులకు ఫోన్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఆదోని మండలం పెద్ద తుంబళం నబీ ట్రేడర్స్ ఎరువుల దుకాణదారులు స్సైస్ కంపెనీకి చెందిన డీఏపీని ఒక ప్యాకెట్ రూ.1350లకు విక్రయించారు.
వందల ఎరువుల ప్యాకెట్లను రైతులకు అంటగట్టారు. అయితే పంటలకు పిచికారీ చేసే క్రమంలో యూరియాలో సంబంధిత స్పైస్ డీఏపీని కలపగా, ఒక్కసారిగా డీఏపీ మొత్తం నీటి నీరైంది. రైతులు ఈ డీఏపీ నకిలీదని స్పైస్ కంపెనీ ఉద్యోగులను నిలదీశారు. తాము ఏ డీలర్‌కు స్పైస్ డీఏపీ పంపిణీ చేయలేదని, ఎవరి వద్ద కొనుగోలు చేశారని తెలుసుకొని కంపెనీ ఉద్యోగులు గురువారం నబీ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి వారి గోడౌన్లలో ఉన్న స్పైస్ డీఏపీ ప్యాకెట్ల మొత్తం నకిలీవని గుర్తించారు. కంపెనీ యజమానులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుకాణదారుడు ఇలియాస్ తక్షణమే దుకాణంలో ఉన్న నకిలీ ఎరువులను ఆటోల్లో తన ఇంటికి తరలించాడు. వ్యవసాయ అధికారి సుధాకర్ సిబ్బందితో ుకాణానికి చేరుకొని స్పైస్ డీఏపీ ఎరువులు కర్ణాటక నుంచి దిగుమతి అయ్యాయని గుర్తించారు. వీటికి అనుమ తులు లేవని గుర్తించి 100 డీఏపీ సంచులను సీజ్ చేశారు. నకిలీ ఎరువుల దందాపై విజిలెన్స్ అధికారులపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
రైతులు ఫిర్యాదు చేశారు
మా కంపెనీ గత మూడు నెలలుగా ఆదోని డివిజన్ పరి ధిలో ఏడీలర్‌కు, ఏ డిస్ర్టిబ్యూ టర్‌కు స్పైస్ డీఏపీ ఎరువు లను పంపిణీ చేయలేదు. యూరియాతో పాటు స్పైస్ డీఏపీ ఎరువును కలపడం వలన మొత్తం నీరు నీరు అవుతుందని కొందరు రైతులు మాకు ఫిర్యాదు చేశా రు. ఈ నకిలీ డీఏపీ వలన ఎలాంటి ప్రయోజనం లేదు. సురేష్, స్పైస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, ఆదోని
కర్ణాటక నుంచి తెప్పించాను
స్పైస్ డీఏపీ ఎరువులను కర్ణాటక నుంచి తెప్పించి రైతులకు విక్రయించాం. అవి నకిలీవని మాకు తెలి యదు. పొరపాటైంది..ఇంకొసారి ఇలా చేయను. ఇలియాస్, నబీ ట్రేడర్స్, పెద్దతుంబళం
డీఏపీ సంచులను సీజ్ చేసి ల్యాబ్‌కు తరలించాం
పెద్దతుంబళం నబీ ట్రేడర్స్‌లో నకిలీ స్పైస్ డీఏపీ సం చులు ఉన్నాయని సమాచారం రావడంతో స్పైస్ ఉ ద్యోగులతో కలిసి పరిశీలించాం. అనుమానిత 100 డీఏ పీ సంచులను సీజ్‌చేసి ల్యాబ్‌కు తరలించాం. తదుపరి చర్యలు తీసుకుంటాం. సుధాకర్, ఏవో, ఆదోని