బోర్డులతో బోల్తా కొట్టించారు..ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:08 AM
బోర్డులు మార్చి క్షణాల్లో అధికారులను బోల్తా కొట్టించారు. సినీ ఫక్కీలో అప్పటికప్పుడు అన్ని సర్దుబాటు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులు వారి మాట వినేలా చేశారు. మీడియా ప్రతినిధులను తప్పుదోవ పట్టించారు. అధికారులు రాలేదంటూ అబద్ధాలు పలికారు.
క్షణాల్లో బోర్డు మార్చిన నర్సింగ్ కాలేజీ యాజమాన్యం
అప్పటి వరకు జూనియర్ కళాశాల ఆవెంటనే నర్సింగ్ స్కూల్
కర్నూలులో ఉన్న కళాశాల అనుమతితో సర్టిఫికెట్లు
అంధకారంలో విద్యార్థుల భవితవ్యం
ఆదోని అగ్రికల్చర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): బోర్డులు మార్చి క్షణాల్లో అధికారులను బోల్తా కొట్టించారు. సినీ ఫక్కీలో అప్పటికప్పుడు అన్ని సర్దుబాటు చేశారు. తనిఖీల కోసం వచ్చిన అధికారులు వారి మాట వినేలా చేశారు. మీడియా ప్రతినిధులను తప్పుదోవ పట్టించారు. అధికారులు రాలేదంటూ అబద్ధాలు పలికారు.. శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహాలో సాగిన ఈఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల రహదారిలో వెంకటేశ్వర జూనియర్ కళాశాల పక్కన ఆర్‌ఎస్ నర్సింగ్ స్కూల్‌ను మూడేళ్ల కిందట ఏర్పాటుచేశారు. ఓఇంటిని అద్దెకు తీసుకొని ఆర్‌ఎస్ నర్సింగ్ స్కూల్ అంటూ బోర్డు పెట్టేశారు. ఇంటర్ పూర్తయిన వారికి జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫైరీ (జీఎన్‌ఎమ్) మూడున్నరేళ్ల కోర్సుకు ప్రవేశాలు జరుపుకున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా జీఎన్‌ఎమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు కళాశాలకున్న అనుమతులతో సర్టిఫికెట్లను వారికి అందజేస్తున్నట్లు తెలుస్తుంది.
అనుమతుల కోసం..
ఆదోనిలో ఆర్‌ఎస్ నర్సింగ్ స్కూల్ ఉందని ఇటీవల అనుమతుల కోసం ప్రభుత్వా నికి దరఖాస్తు చేసుకున్నారు. వైద్యారోగ్య శాఖ విజయవాడ డీఎంఈ రిజిస్టర్ కా ర్యాలయం నుంచి తనిఖీల కోసం బుధవారం అధికారులు వచ్చారు. ముందుగానే ఆర్‌ఎస్ నర్సింగ్ స్కూల్ ఆఫ్ కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడే అదే ఏరియాలో వెనుక రోడ్డులో ఉన్న విశ్వనారాయణ ఒకేషనల్ జూనియర్ కళాశాలను అదే అంటూ చూపించే ప్రయత్నించారు. విశ్వ నారాయణ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించి ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌కు గంటపాటు అప్పచెప్పారు. అధికారులు వచ్చే లోపు అక్కడున్న వాతా వరణం అంతా మార్చేశారు.
అప్పటికప్పుడు అన్ని మార్పు..
విశ్వనారాయణ జూనియర్ ఒకేషనల్ కళాశాల బోర్డు స్థానంలో ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ సర్సింగ్ స్టిక్కర్‌ను అప్పటికప్పుడే అతికించేశారు. అప్పటికప్పుడే గేటుకు ఓ బో ర్డును తగిలించారు. ఆజూనియర్ కళాశాలకు చెందిన బస్సును సైతం ముందు భాగంలో ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటూ స్టికర్ చేశారు. ఫ్యాకల్టీ ఎవరు లేకున్నా కర్నూలు నుంచి వారిని కార్లలో రప్పించి తెల్లకోటు (యాప్రాన్) ధరింప చేసి వీరే బోధించే ఫ్యాకల్టీ అని చూపించారు. ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌కు ల్యాబ్‌లు లేకున్నా గంటపాటు కళాశాలకు చెందిన ల్యాబ్‌లు ఉన్నాయంటూ సెట్ చేశారు. మీడియా ప్రతినిధులకు అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలియ డంతో అక్కడికి వెళ్లారు. మీడియా ప్రతినిధులను చూసి తనిఖీలకు వస్తున్న అధికారులను ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం అలా కారులోనే ఆదోని అంతా తిప్పారు. మీడియా ప్రతినిధులను తప్పుదోవ పట్టించేందుకు అధికారులు రావడం లేదంటూ కళాశాలలో ఉన్న విద్యార్థులను మరోచోటికి పంపారు. సిబ్బంది అంతా బయటికి వెళ్లారు. ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ బోర్డును తిప్పేశారు. అక్కడినుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిన వెంటనే అరగంటలోనే తనిఖీకొచ్చిన అధికారులను మరోమారు సెట్ చేసి లేనివి ఉన్నట్లు వారికి కళాశాల యాజమాన్యం చూపించారు. తనిఖీకొచ్చిన అధికా రులు ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవడం పట్ల పలు అనుమానా లకు తావిస్తోంది. నర్సింగ్ విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. కర్నూలులో ఉన్న కళాశాలలకు చెందిన గుర్తింపు సర్టిపికెట్లను అందజేస్తున్నారు.
తనిఖీకి వస్తున్నారంటే..
ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం వాళ్లు అనుమ తులు దరఖాస్తు చేసు కున్నామని, అధికారులు తనిఖీ కోసం వస్తున్నారంటూ బిల్డింగ్ కావాలని చెప్పడంతో సరే అన్నా. మా కళాశాలలో ల్యాబ్, ప్రిన్సిపాల్ గదిని, తరగతి గదులను తనిఖీ అధికారులకు చూపించారు. మా బోర్డు తీసేసి ఆర్‌ఎస్ స్కూల్ ఆప్ స్కూల్ స్టిక్కర్‌ను అతికించుకున్నారు. తనిఖీలు అయిన వెంటనే మాకళాశాల మాకు అప్పజెప్పారు. - మల్లికార్జున, కరస్పాండెంట్, విశ్వనారాయాణ కళాశాల, ఆదోని