Share News

నంద్యాల కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:38 AM

: బైకుల చోరీలో దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా గుట్టును రట్టు చేశారు. కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు ఇటీవల ఈ నెల 14వ తేదీన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు!
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాబు ప్రసాద్‌

దేశ వ్యాప్తంగా సరఫరా

బైక్‌ల రికవరీతో కదిలిన డొంక

నలుగురు నిందితుల అరెస్టు

కర్నూలు క్రైం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): బైకుల చోరీలో దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా గుట్టును రట్టు చేశారు. కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు ఇటీవల ఈ నెల 14వ తేదీన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఆర్టీఏ బ్రోకర్లకు నకిలీ ఆర్సీలు తయారు చేయించి ఇస్తున్న ముఠా పట్టుబడింది. ఇందుకు సంబంధిం చిన వివరాలను సోమవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, త్రీటౌన్‌ సీఐ శేషయ్యలు వెల్లడించారు. నింది తులు షేక్‌ షాపీర్‌బాషా (చాంద్‌బాడ, నంద్యాల), షేక్‌ సుభాన్‌ (బాల్‌కొండహాల్‌, నంద్యాల), సుధీర్‌బాబు (వీసీ కాలనీ, నంద్యాల), పెనుగొండ సూరప్ప (రెవెన్యూ కాలనీ, కర్నూలు)లను అరెస్టు చేశారు. నంద్యాల కేంద్రంగా నడిపిన నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాకు షేక్‌ షాఫీర్‌ బాషా నాయ కుడు. షేక్‌ సుభాన్‌, సుదీర్‌బాబు, పెనుగొండ సూరప్పలు వారికి కావాల్సిన నకిలీ ఆర్సీలు, ఐటీఐ సర్టిఫికెట్లు తదితర వాటిని తయారు చేయించుకుంటారు. ఇప్పటి వరకు సుధీర్‌ బాబు అనే నిందితుడు 150 డూప్లికేట్‌ ఆర్సీలు, పోలీసు ఎన్‌వోసీలు షాఫీర్‌బాషా వద్ద తయారు చేయించుకున్నాడు. పెనుగొండ సూరప్ప అనే వ్యక్తి డోన్‌ ఐటీఐ కాలేజీలో పని చేస్తూ సుమారు 500 నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లు తయారు చేయించు కున్నాడు. సుభాన్‌ అనే నిందితుడు 50 డూప్లికేట్‌ ఆర్‌సీలు తయారు చేయించు కున్నారు. దీంతో పాటు షాఫీర్‌బాషా, సుబాన్‌లు కలిసి ఫేస్‌బుక్‌లో ‘పీవీసీ చిప్‌ కార్డులు దొరుకును’ అంటూ వివిధ భాషల్లో ఓ ప్రకటనను ఇచ్చుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఈ ప్రకటనను చూసిన పలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, కేరళ, ఒరిస్సా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఆర్‌టీఏ బ్రోకర్లు వీరిని సంప్రదిం చారు. అక్కడి నుంచి వారు తమకు అవసరమైన డేటాను షాఫీర్‌, సుబాన్‌లకు పంపిస్తే వీరు తమ తెలివితేటలతో ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ ఆర్సీలు తయారు చేసి కొరియర్‌ ద్వారా పంపిస్తారు. ఇలా తమ దందా కొనసాగిస్తూ వచ్చారు.

బైకుల రికవరిలో ఆరా తీస్తే.. ఈ నిందితుల బాగోతం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లు, 2 నకిలీ పోలీసు ఎన్‌వోసీలు, ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్‌, ఒక సీల్‌, 29 నకిలీ ఆర్సీలు, ఒక ఇన్నోవా, ఒక హోండా కారు, 150 ఖాళీ పీవీసీ చిప్‌ కార్డులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 220 డూప్లికేట్‌ ఆర్సీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీఐలు శేషయ్య, నాగశేఖర్‌, ఎస్‌ఐలు చంద్ర, మల్లికార్జున, అంజనప్ప, రెహిమాన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు, కానిస్టేబుల్‌ శేఖర్‌, చంద్రబాబు నాయుడు కిరణ్‌ కుమార్‌, పరమేశ్వరుడు, వీరబాబులను డీఎస్పీ అభినందించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jul 22 , 2025 | 12:38 AM