Share News

బడుల్లో జాతర..

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:01 AM

: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి అపూర్వ స్పందన కనిపించింది.

బడుల్లో జాతర..
మాట్లాడుతున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

మెగా పీటీఎం 2.0కు అపూర్వ స్పందన

జిల్లాలో 10 లక్షల మందికి పైగా హాజరు

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి అపూర్వ స్పందన కనిపించింది. అన్ని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో జాతర వాతావరణాన్ని తలపించాయి. జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, పూర్వ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని ఆటల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌, ముగ్గుల పోటీలతో పాటు విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అత్యధిక మార్కులు సాధించి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు ఎంపికైన విద్యార్థులను సత్కరించారు. అలాగే విద్యార్థి తల్లికి ఒక మొక్కను అందజేసి పెంచే బాధ్యతను అప్పగించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలసి అందరూ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.

విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

వెల్దుర్తి, జూలై 10(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు, పాఠశాలల మధ్య బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ను నిర్వహిస్తోందని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. గురువారం వెల్దుర్తి జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయనతో పా టు డీఈఓ శ్యామ్యుల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రంజిత్‌బాషా మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలో చదివా నని తెలిపారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివి కలెక్టర్‌ అయ్యానని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. అనంతరం విద్యార్థులతో కలసి ఆటల్లో పాల్గొన్నారు. మొక్కలను పంపిణీ చేశారు. షైనింగ్‌ అవార్డులు పొందిన లావణ్య, మేఘన, తనిష్కలను సత్కరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన మ్యూజికల్‌ చైర్స్‌, కబడ్డీ తదితర ఆటల్లో కలెక్టర్‌, డీఈఓలు పాల్గొన్నారు.

విద్యతో భవిష్యత్తు : మంత్రి టీజీ భరత్‌

మెరుగైన విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. కర్నూలు నగరం ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా పీటీఎం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు వారి ఇష్టమైన విద్యలో కోర్సులను అభ్యసించే విదంగా ప్రోత్సహించాలని, వారికి ఇష్టం లేని విషయంలో బలవంతంగా వ్యవహరించరాదని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారనీ, అందులో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారనీ తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈవో ఓంకార్‌ యాదవ్‌, పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌, కార్పొరేటర్‌ మౌనికారెడ్డి, ఎస్‌డబ్లూవో మద్దిలేటి, తల్లిదండ్రులు, విద్యాకమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టౌన్‌ మోడల్‌ కళాశాలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇదే కళాశాలలో తాను, మా సోదరి ఇంటర్మీడియట్‌ చదువుకున్నామని గుర్తు చేశారు. ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్‌గా నిలిచిన పావని అనే విద్యార్థినితో పాటు తైక్వాండో క్రీడలో పతకాలు సాధించిన విద్యార్థులను మంత్రి టీజీ భరత్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:01 AM