బుగ్గన కుమారుడి రిసెప్షన్‌కు వైఎస్ జగన్
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:28 AM
పట్టణ సమీపంలోని దత్తాత్రేయస్వామి ఆలయ వెనుక ప్రాంతంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడి బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులు
సుమారు 20 నిమిషాల పాటు హైవేపై వాహనాలను నిలిపివేసిన పోలీసులు
ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రయాణికులు
డోన్ రూరల్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని దత్తాత్రేయస్వామి ఆలయ వెనుక ప్రాంతంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడి బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా హెలిప్యాడ్ నుంచి రిసెప్షన్ వేదికకు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. పార్టీ శ్రేణులకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు. అభిమానులు ఆయనకు కరచాలనం చేసే ప్రయత్నంలో తోపులాట జరిగింది. అయితే.. ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా డోన్‌కు షెడ్యూల్ ప్రకారం రూ.11.45 గంటలకు చేరుకున్నారు. వివాహ రిసెప్షన్ వేదికలో నూతన వధూవరులను ఆశీర్వదించి 12.30 గంటలోపు తిరిగి హెలికాఫ్టర్‌లో బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు.
ఇబ్బందులు పడ్డ వాహనదారులు
డోన్ పట్టణ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి సమీప ప్రాంతంలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. హైవేపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరిగి వెళ్లేవరకు పోలీసులు సుమారు 20 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. డోన్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో డోన్ పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, సీఎం రాకేష్‌బాబు, పోలీసు సిబ్బందితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పోలీసు అధికారులు మొత్తం 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అభిమానుల అత్యుత్సాహం
డోన్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ యువ అభిమానులు తగ్గేదెలే.. అంటూ వైఎస్ జగన్ ఫొటోతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బైకుల మీద హెలిప్యాడ్ ప్రధాన రోడ్డు ప్రాంతంలో కొద్దిసేపు హల్‌చల్ చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అంటూ ప్రవేశ పెట్టిన రేషన్ వాహనాన్ని పార్టీ అభిమాని వైఎస్ జగన్ బొమ్మ ఉన్న అప్పటి రేషన్ వాహనంతో రోడ్డుపై చక్కర్లు కొట్టారు.