Share News

‘నీట్‌’కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 03 , 2025 | 11:19 PM

మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే ఆఫ్‌లైన్‌ ప్రవేశ పరీక్ష నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ఆదివారం జరుగనున్నది.

‘నీట్‌’కు సర్వం సిద్ధం

కర్నూలులో 16 పరీక్షా కేంద్రాలు

పరీక్షకు హాజరు కానున్న 4,466 మంది

ఒక నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, మే 3(ఆంధ్రజ్యోతి): మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే ఆఫ్‌లైన్‌ ప్రవేశ పరీక్ష నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ఆదివారం జరుగనున్నది. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆయా పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, జిల్లా కో-ఆర్డినేటర్స్‌, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్‌ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. కర్నూలులో 16 పరీక్షా కేంద్రాల్లో నీట్‌ పరీక్ష జరుగనున్నది. ఈపరీక్షకు 4,466 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ అభ్యర్థులకు ఆడ్మిట్‌ కార్డులు జారీఅయ్యాయి. ఒక్కొక్క పరీక్షా కేంద్రంలో 360 మంది ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రంలో సూపరింటెండెంట్‌తో పాటు, వివిధశాఖల అధికారులు పరీక్షా కేంద్రాలను సమన్వయం చేసేందుకు కేటాయింపులు చేశారు. ఎగ్జామ్‌ సెంటర్లలో ఫ్యాన్లు, లైటింగ్‌, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సంబంధించిన హాల్‌ టికెట్‌ నంబర్లను వేశారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నిర్ణయించిన సమయం కంటే ఒక నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు తెలిపారు.

అభ్యర్థులకు సూచనలు

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత మెయిన్‌ గేట్లను మూసివేస్తారు.

సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. బంగారు అభరణాలు, ముక్కుపుడకలు, చేతి గడియారాలు అనుమతించరు.

పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్‌ నుంచి బయటకు వెళ్లకూడదు. బయోమెట్రిక్‌ ధ్రువీకరణకు అంతరాయం కలిగించే మెహిందీ చేతులకు వాడరాదు.

హాల్‌ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి.

పరీక్షా కేంద్రాలు ఇవే

కట్టమంచి రామలింగారెడ్డి మోమొరియల్‌ ( ఏపీఎస్‌ఏపీ క్యాంప్‌), రాయలసీమ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌( ఆర్‌యూ), ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల(బీ.క్యాంప్‌), ప్రభుత్వ మైనార్టీ జూనియర్‌ కళాశాల(గడియారం ఆస్పత్రి), ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ కాలేజీ (పాత కంట్రోల్‌రూం), ఇందిరాంగాంధీ మెమోరియల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ (ఏ.క్యాంప్‌), ఐఐటీడీఎం (దిన్నెదేవరపాడు), క్లస్టర్‌ యూనివర్సిటీ(సిల్వర్‌ జుబ్లీ కళాశాల క్యాంపస్‌) సిల్వర్‌ జుబ్లీ ప్రభుత్వ కళాశాల(బీ.క్యాంపు), కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ(రైల్వేస్టేషన్‌ రోడ్డు), కేంద్రీయ విద్యాలయం(నంద్యాల చెక్‌పోస్టు), మోడల్‌ స్కూల్‌( ఐహెచ్‌ఎస్‌ డీపీ కాలనీ, పెద్దపాడు) ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ మైనార్టీ కళాశాల(బీ.తాండ్రపాడు)

Updated Date - May 03 , 2025 | 11:19 PM