Share News

అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి..

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:00 AM

కర్నూలు అభివృద్ధి కోసమే.. తాను రాజకీయాల్లోకి వచ్చానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి..
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

సర్వే అధారంగా అభ్యర్థుల ఎంపిక

నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకార సభలో మంత్రి టీజీ. భరత్‌

కర్నూలు అర్బన్‌ , డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కర్నూలు అభివృద్ధి కోసమే.. తాను రాజకీయాల్లోకి వచ్చానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని మౌర్యఇన్‌ హోటల్‌లో కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్లస్టర్‌, కో క్లస్టర్‌, యూనిట్‌, వార్డు, బూత్‌ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతన కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీ క్యాడర్‌ మొత్తం నిరంతరం కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల్లో మంచి పేరున్న నాయకులకు అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సర్వేలు చేసి టికెట్లు కేటాయిస్తామన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేటప్పుడు సర్వేలో ప్రజల్లో మంచి పేరు ఉన్నదని తేలినందుకే టికెట్‌ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నమ్మకానికి తగ్గట్టుగా కష్టపడుతున్నానని అన్నారు. ప్రతి వార్డులో ప్రధానమైన 3 సమస్యలు గుర్తించి ముందుగా వాటిని పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గూడెం, కొట్టాల వాసులకు మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు పట్టాలిచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. ఏబీసీ క్యాంపును అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. అక్కడ హైకోర్టు బెంచ్‌, కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు చేరవేయాలన్నారు. అనంతపురం నుండి కర్నూలు వరకు కారిడార్‌ అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతంలోకి భారీగా పరిశ్రమలు తరలి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌, కార్పొరేషన్ల డైరెక్టర్లు సంజీవ లక్ష్మి, జగదీష్‌ గుప్తా, సంతోష్‌, కాణిపాకం ఆలయ బోర్డు మెంబర్‌ రాజ్యలక్ష్మి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ శేషగిరి శెట్టి, మారుతి శర్మ, తెలుగు యువత జిల్లా అఽధ్యక్షుడు అబ్బాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:01 AM