ఎడతెగని నిరీక్షణ
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:56 PM
ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా గ్రామం వెంకటగిరిలో గతేడాది నవంబరులో ఓ రైతు రెండెకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు
రీ-సర్వే భూ హక్కు రికార్డుల్లో తప్పిదాలెన్నో
సవరణ తరువాతే కొత్త పుస్తకాల ముద్రణ
ఇతర గ్రామాల్లోనూ తప్పని అవస్థలు
పంట రుణాలు, రైతు సంక్షేమ పథకాలు అందని దైన్యం
తహసీల్దారు కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు
జిల్లాలో 55 వేల మంది రైతుల ఎదురుచూపులు
ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా గ్రామం వెంకటగిరిలో గతేడాది నవంబరులో ఓ రైతు రెండెకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం కోసం మీ-సేవా కేంద్రంలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల్లో పాసు పుస్తకం వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఏడాది గడిచినా ఇప్పటికీ అతీగతి లేదు. రెవెన్యూ అధికారులను అడిగితే చెన్నైలో ముద్రణ జాప్యం జరుగుతోందన్నారు. పాసుబుక్ లేకపోవడంతో రైతు పంట రుణం, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వంటి పథకాలను కోల్పోయాడు. దాదాపు 55 వేల మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 472 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 15 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో 252 గ్రామాల్లో 2.25 లక్షల ఎకరాల్లో భూ రీ-సర్వే చేశారు. సుమారు 2.25 లక్షల ఎకరాల్లో రీ-సర్వే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామం చొప్పున రీ-సర్వే చేపట్టారు. ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేసి ఆ తరువాత మరో గ్రామం ఎంపిక చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీ-సర్వే చేసిన గ్రామాల్లో భూ రికార్డుల్లో ఎన్నో తప్పులు దొర్లాయి. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ చూపడం, ఒకరి భూమిని మరొకరి పేరిట నమోదు చేయడం.. ఇనాం భూములు సమస్యలు.. ఇలాంటి లోపాలతో రైతుల్లో గందరగోళం సృష్టించారు. భూ రికార్డులు సరిచేయాలంటూ గత జనవరిలో జరి గిన గ్రామ సభల్లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేశారు. ఆతరువాత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ ఎస్)లో కూడా పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. భూ రికార్డుల్లో లోపాలు సరిచేసి రైతులకు భూయాజమాన్య హక్కు పత్రాలు (పట్టాదారు పాసు పుస్తకాలు) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా ఏడాది గడిచినా పాసు పుస్తకా లు అందక అన్నదాతలు పడుతున్న అవస్థలు ఎన్నో. అదిగో.. ఇదిగో అంటూ రెవెన్యూ అధికారులు పొంతన లేని సమధానాలు చెబు తుండడంతో పాసు పుస్తకాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రభుత్వ సాయం కోల్పోతున్న రైతులు
రీ-సర్వే గ్రామాల్లో రికార్డుల్లో లోపాలు, ఇనామ్ భూముల నమోదు చేసేందుకు జాయింట్ కలెక్టరు ఒక్కరికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో భూ రికార్డుల లోపాలు సరిచేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. జిల్లాలో 252 గ్రామాల్లో రీ-సర్వే చేస్తే ఇప్పటి వరకు 65 గ్రామాల్లో మాత్రమే లోపాలు సరిదిద్దారు. 187 గ్రామాల్లో పొరపాట్లు సరిదిద్దాల్సి ఉంది. అప్పటి వరకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందని ద్రాక్షగా మారింది. రీ-సర్వే గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో కూడా రైతులు కుటుంబ అవసరాలు, చేసిన అప్పులు తీర్చేందుకు ఎందరో రైతులు భూములు అమ్ముకున్నారు. కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకొని, మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఏడాది గడిచినా పట్టాదారు పాసు పుస్తకాలు అందడం లేదు. ఫలితంగా రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ఆర్థిక సాయం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని కోరుతున్నారు. అయితే.. రైతుల అవసరాన్ని కొన్ని మండలాల్లో రెవిన్యూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రూ.25 వేలకు పైగా డిమాండ్ చేస్తున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరిట అప్పటి సీఎం జగన్ పెద్ద సైజు ఫొటోతో రైతులకు ‘జగనన్న భూ హక్కు పత్రం’ (పట్టాదారు పాసు పుస్తకం) జారీ చేశారు. జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పట్లో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టాదారు పాసు పుస్తకం విషయంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయ నం కోసం ఓ కమిటీ వేసింది. పాత పద్ధ్దతిలోనే రాజముద్రతో, సెక్యూరిటీ ఫీచర్లతో పుస్తకాలు ముద్రించాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, ఆధార్ కార్డుతో సమగ్ర భూ వివరాలతో చూడగానే రైతుకు భూ హక్కుపై భరోసా, నమ్మకం కలిగేలా పట్టాదారు పాసు పుస్తకం డిజైన్ చేశారు. ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత 21.86 లక్షల పట్టాదాదరు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జూలై మాసంలో వెల్లడించారు. జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 252 గ్రామాల్లో 21,588 జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు ఇచ్చారు. 61,817 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందాల్సి ఉంది. వీరికి ఇప్పటికీ పాసు పుస్తకాలు అందక ఎన్నో అవస్థలు పడుతున్నారు. మిగిలిన గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని, రైతులకు యథావిధిగా పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చినా క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వాస్తవాలు కొన్ని:
కోడుమూరు నియోజకవర్గంలో 51 రెవిన్యూ గ్రామాలు ఉంటే 33 గ్రామాల్లో రీ-సర్వే చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం 3,353 మంది రైతులకు దరఖాస్తులు చేస్తే, రెండేళ్లుగా పుస్తకాలు అందలేదు. రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.
మంత్రాయలం నియోజకవర్గంలో 101 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 64 గ్రామాల్లో రీ-సర్వే చేశారు. 144 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం 15 నెలలుగా ఎదురు చూస్తున్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 55 రెవిన్యూ గ్రామాలు ఉంటే 45 గ్రామాల్లో రీ-సర్వే చేశారు. దాదాపు 8,647 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందాల్సి ఉంది. జిల్లాలోనే అత్యధికంగా ఈ నియోజకవర్గంలో భూ హక్క పత్రాలు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
ఆదోని నియోజకవర్గంలో 46 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 28 గ్రామాల్లో రీ-సర్వే చేశారు. 14 గ్రామాల్లో 6,656 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు కోసం ఏడాదిన్నరకు పైగా రెవిన్యూ కార్యాలయం మెట్లక్కడం.. దిగడంతోనే సరిపోయింది.
ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, హొళగుంద, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో 75 రెవిన్యూ గ్రామాల ఉంటే 56 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 24,956 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందాల్సి ఉంది. పత్తికొండ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
త్వరలోనే పట్టాదారు పాసు పుస్తకాలు వస్తాయి - నూరుల్ కామర్, జాయింట్ కలెక్టర్, కర్నూలు:
జిల్లాలో 252 గ్రామాల్లో రీ-సర్వే జరిగింది. భూ రికార్డుల నమోదులు పలు లోపాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అదే క్రమంలో సెటిమెంట్ ఇనామ్, సర్వీస్ ఇనామ్ భూముల సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 65 గ్రామాల్లో లోపాలు సరి చేశాం. మండలాల్లో తహసీల్దార్ల లాగిన్‌లో కూడా భూ రికార్డుల్లో లోపాలు సరి చేసేందుకు అవకాశం ఇవ్వాలని సీసీఎల్‌ఏకు లేఖ రాశాం. త్వరలోనే రైతులకు రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందుతాయి. రీ-సర్వే చేయని గ్రామాల్లో యథావిధిగా పాసు పుస్తకాలు ఇస్తారు.
ఎమ్మిగనూరు మండలంలో మొత్తం 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 16,677 మంది రైతులు పాసు పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 9253 మంది రైతుల పాసుపుస్తకాలను ప్రభుత్వం మంజూరు చేయగా 7,424 మంది రైతులకు పాసు పుస్తకాలు మంజూరు కాలేదు. అయితే మంజూరైన పాసుపుస్తకాలను సైతం రైతులకు ఇప్పటివరకు అందజేయలేదు.