ఖాళీ జాగా.. వైసీపీ పాగా
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:37 PM
ఖాళీ జాగా.. వైసీపీ పాగా
కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలాలు
రాత్రికి రాత్రే షెడ్లు వేసి ఆక్రమణ
పేదల స్థలాలను సైతం వదలని వైనం
పట్టించుకోని అధికారులు
లబోదిబోమంటున్న బాధితులు
కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది వైసీపీ నాయకుల తీరు. ప్రభుత్వ స్థలాలు ఖాళీలుగా కనపడితే చాలు కబ్జాలకు సిద్ధమవుతున్నారు. రాత్రికి రాత్రే షెడ్లు వేసేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలను సైతం వదటడం లేదు. నకిలీ పట్టాలు సృష్టించి తామే అసలైన లబ్ధిదారులు అన్నట్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామంలో కబ్జాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారం అంతా గత వైసీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగింది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నందవరం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగలదిన్నె గ్రామంలో వైసీపీ నేతల కబ్జాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు న్నాయి. ఎమ్మిగనూరు నుంచి గద్వాల అలాగే హైదరబాద్‌కు వెళ్లే రహదారిలో నాగలదిన్నెలో సెంటు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ధర పలుకుతోంది. ఇదే అదునుగా భావించిన కొంత మంది వైసీపీ నాయకుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది.
1,955 మంది లబ్ధిదారులకు పట్టాలు..
2009లో వరదలు రావడంతో నాగలదిన్నెలోనే ఎమ్మిగనూరుకు వెళ్లే దారిలో ప్రభుత్వం 85 ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. 1,955 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసింది. 1,686 మందికి నకలు పట్టాలు ఇచ్చారు. మిగిలిన 269 మందికి పట్టాలు ఇవ్వలేదు. అందులో ఆర్యవైశ్యులకు 84 మందికి పట్టాలు ఇచ్చారు. గ్రామానికి చెందిన అనురాధ భర్త రమే్‌షశెట్టి పట్టా నెంబర్ 401, సుబ్బలక్ష్మీ భర్త రత్నయ్యశెట్టి పేరు మీద పట్టా నెంబర్ 402ను ప్రభుత్వం వారికి మంజురు చేసింది. వారు గ్రామంలో లేకపోవడంతో వైసీపీ నాయకుడి కన్ను పడింది.
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో..
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సర్వే నెంబర్ 401ను సరోజమ్మ, భర్త రంగారెడ్డి, సర్వే నెంబరు 402లో తెలుగు నరసమ్మ, భర్త వేమారెడ్డి పేర్లపై పట్టాలు పొందాడు. అక్రమ షెడ్లువేశారు. వాస్తవంగా ఆకాలనీలో పట్టానంబరు 1,123 పేరు మీద సరోజమ్మ, 1,490లో తెలుగు నరసమ్మ పేరు మీద ప్రభుత్వం వారికి ముందే పట్టాలు మంజురు చేసింది.
ఇదే అదనుగా కొందరు..
వైసీపీ నాయకుల అండదండలు చూసుకొని కొంత మంది నకిలీ పట్టాలు ఏర్పాటుచేసుకొని కబ్జాకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిపి పట్టాలు చూపించాలని కోరుతున్నారు. మరో వైసీపీ నాయకుడికి గతంలోనే ఏకంగా శ్మశానంపైనే కన్ను పడింది. కానీ ప్రస్తుతం ఆ స్థలంలో అధికారులు బోర్డు పెట్టారు. మరో నాయకుడు సర్వేనెంబరు 59లో బస్టాండ్ ఎదురుగానే మెయిన్ రోడ్డు పక్కనే లబ్ధిదారులకు ఇచ్చిన ప్లాట్లు, వాటర్ ట్యాంక్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేశాడు. అందులో కూడా షెడ్లు వేశాడు. బాధిత కుటుంబాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేసినా అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతి నిధితో అధికారులపై ఒత్తిడి తెచ్చి అడ్డుకట్ట వేయించారు. దీంతో ఆనాయకుడు నిర్మాణాలు చేపట్టాడు.
పంచాయతీ తీర్మానాల కోసం..
కబ్జా చేసిన వైసీపీ నాయకులు ఇంత వరకు పంచాయతీ తీర్మానం లేకపోవడంతో తం టాలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి తీర్మానం రాయనని, సర్పంచ్, వార్డు సభ్యులతో మాట్లాడి తీర్మానం చేసుకోవాలని తెలపడంతో కబ్జాదారులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారిందని ఎలాగైనా తీర్మానం చేయించకపోతే తమ అక్రమంగా కట్టుకున్న షెడ్లు తొలగించే పరిస్థితి నెలకొంటుందని వారితో బేర సారాలు ఆడుతున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే ఆదేశించినా..
నాగలదిన్నెలో కబ్జాకు గురైన స్థలాలను రికవరీ చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
లబ్ధిదారులకు న్యాయం చేస్తా
నేను కొత్తగా వచ్చాను. మా సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరిస్తా. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు లబ్ధిదారులకు వచ్చేలా న్యాయం చేస్తా.
- శ్రీనివాసులు, తహసీల్దార్