హత్య కేసులో ఎనిమిది మంది అరెస్టు
ABN , Publish Date - May 01 , 2025 | 11:45 PM
కోడుమూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 27వ తేదీ పులకుర్తి గ్రామంలో జరిగిన నడిపి రంగడు హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు.
డీఎస్పీ బాబుప్రసాద్
కర్నూలు క్రైం, మే 1 (ఆంధ్రజ్యోతి): కోడుమూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 27వ తేదీ పులకుర్తి గ్రామంలో జరిగిన నడిపి రంగడు హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిం చారు. పులకుర్తి గ్రామానికి చెందిన హతుడు రంగడు మేనల్లుడైన సురేష్‌కు బోయ మునిస్వామికి మధ్య ఓ యువతి విషయంలో తరుచూ గొడవలు జరిగాయి. దీంతో పాటు ఇదే గ్రామానికి చెందిన బోయ దస్తగిరి, బోయ నరసింహులుకు మధ్య తిరునాళ్లలో ఘర్షణ జరిగింది. ఈవిషయంలో నడిపి రంగడు, సురేష్ ఇద్దరూ నరసింహు లుకు మద్దతు ఇవ్వగా.. మునిస్వామి దస్తగిరికి సపోర్టు చేశాడు. దీంతో సురేష్, మునిస్వామిల మధ్య వైరం మరింత పెరిగింది. ముని స్వామిపై దొంగ అని, చాలా కేసులు ఉన్నాయని సురేష్ అవమా నించాడు. దీంతో మునిస్వామి సురేష్‌పై కక్ష పెంచుకొని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గతనెల 26వ తేదీ రాత్రి ముని స్వామి, అతని స్నేహితులు మహేష్ మద్యం సేవించి సురేష్ వద్దకు వెళ్లారు. సురేష్ కనిపించకపోవడంతో అతడి ట్రాక్టర్ డ్రైవర్ సోమే ష్‌ను కొట్టారు. 27వ తేదీ ఉదయం సోమేష్ ఈ విషయాన్ని రంగడు, సురేష్‌లకు చెప్పాడు. దీంతో మరోసారి వారి మధ్య తగాదా జరిగింది. ఈ ఘర్షణలో నడిపి రంగడు, సురేష్‌లపై కట్టెలతో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో రంగడు తీవ్రంగా గాయపడి 28వ తేదీన మృతి చెందాడు. కేసు నమోదు చేసిన కోడుమూరు సీఐ చిరంజీవి, ఎస్‌ఐ స్వామి, గూడూరు ఎస్‌ఐ తిమ్మయ్య నిందితులు మునిస్వామి, బోయ శివ, బోయ బజారి, బోయ రాకేష్, బోయ సురేష్, కల్లపరి నాయుడు, బోయ నాగరాజు, బంగి తిమ్మప్పను అరెస్టు చేశారు. అనంతరం కర్నూలు డీఎస్పీ ఎదుట హాజరుపరిచారు. పోలీసులు నిందితుల నుంచి రాడ్లు, మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.