Share News

డీసీఎంఎస్‌ బలోపేతానికి కృషి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:07 AM

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ప్రకటించారు.

డీసీఎంఎస్‌ బలోపేతానికి కృషి
బాధ్యతలు స్వీకరిస్తున్న వై.నాగేశ్వరరావు యాదవ్‌

చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వై.నాగేశ్వరరావు యాదవ్‌

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ప్రకటించారు. ఆదివారం కర్నూలు నగరంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ముందుగా డీసీఎంఎస్‌ మేనేజర్‌ రాజేష్‌.. చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ ఒకప్పుడు డీసీఎంఎస్‌ అన్ని విభాగాల కంటే ఆర్థికంగా బలోపేతంగా ఉండేదని, అన్ని రకాల సేవలు ప్రజలకు రైతులకు అందేవని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. అనంతరం డీసీఎంఎస్‌ అధికారులు, ఉద్యోగులతో సంస్థ ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర కేంద్రాల పరిధిలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాటికి విముక్తి కల్పించి డీసీఎంఎస్‌ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి రామాంజనేయులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నాగేంద్ర కుమార్‌, డీసీఎంఎస్‌ కేంద్రాల అధికారులు రాజేష్‌, రాజు, షేక్షావలి, షర్మిల, రాజీవ్‌, రవికృష్ణ, నవీన్‌, కిరణ్‌ రెడ్డి, ప్రవీణ్‌, మహేశ్వరరెడ్డి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:07 AM