సీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:16 PM
సీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి
పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధి పరవళ్లు
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
దుర్వేశి గ్రామంలో ‘తొలి అడుగు’
గడివేముల, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దుర్వేశి గ్రామంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ‘తొలి అడుగు‘లో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు బనకచర్ల ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కుందూ నీటి పరవళ్లులాగా పాణ్యం నియోజకవర్గం ఏడాదిలోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పాణ్యం నియోజకవర్గంలో ‘తల్లికి వందనం’లో 32,145 మంది, దీపం పథకంలో 7,914 మంది, అన్నదాత సుఖీభవ పథకంలో 45,775 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఆడబిడ్డకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలన్న ఉ ద్దేశ్యంతో ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో అమలు చేస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారన్నారు. నంద్యాల జిల్లాలో 45 ఆలయాల పునఃనిర్మాణానికి రూ.43.25 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ గాజుల ఆదెన్న, మార్కెట్‌యార్డు చైర్మన్ గీత తదితరులు పాల్గొన్నారు.