సర్వజన వైద్యశాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:23 PM
కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
జీజీహెచ్‌లో రూ.6.74 కోట్లతో సిటీ స్కాన్ ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పవర్ గ్రిడ్ సంస్థ రూ.6.74 కోట్లతో అందజేసిన 128 స్లైస్ సిటీ మిషన్‌ను మంగళవారం సాయంత్రం మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ మా ట్లాడుతూ దక్షిణ భారతదేశంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సిటీ స్కాన్ మిషన్‌ను కర్నూలు జీజీహెచ్‌కు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి నియోజకవర్గ అభివృద్ది, సర్వజన వైద్యశాల అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.
ఆక్సిజన్‌కు రూ.కోట్లు పోతున్నాయ్..
కర్నూలు జీజీహెచ్‌లో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఏజెన్సీకి రూ.కోట్లు పోతున్నాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు క్యూబిక్ మీటర్‌కు రూ.38 చేస్తున్నారని, అదే కర్నూలు జీజీహెచ్‌కి కూడా సరఫరా చేస్తోందని, ఏజెన్సీపై తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ సొంత ఆసుపత్రిలో కేవలం ఆక్సిజన్ సరఫరాకు క్యూబిక్ మీటర్‌కు కేవలం రూ.12చొప్పున సరఫరా అవుతోందన్నారు. కర్నూలు జీజీహెచ్‌కే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు పోతున్నాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు, రుజువులతో ఫిర్యాదు చేశానన్నారు. తక్షణమే ఆక్సిజన్ కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డీజీఎం శ్రీనివాసమూర్తి, పీఆర్వో శ్రీకాంత్, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ పి.వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ కృష్ణ ప్రకాష్ పాల్గొన్నారు.