శ్రీశైలం అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:01 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
శ్రీశైలం బోర్డు సభ్యులుగా మరో ఇద్దరి ప్రమాణ స్వీకారం
శ్రీశైలం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. సోమవారం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కల్యాణమండపంలో భరధ్వాజ శర్మ, గంగమ్మ పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ... శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత మంత్రితోపాటు ముఖ్యమంత్రికి స్వయంగా ప్రత్యేక నివేదికలను అందజేశానని తెలిపారు. భవిష్యత్తులో క్షేత్ర విస్తరణ, ఆవశ్యకత, మాస్టర్ ప్లాన్ అమలుచేయడంలో ధర్మకర్తల పాలక మండలి సభ్యుల పాత్ర కీలకమన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన పాలక మండలి క్షేత్రాభివృద్దికి అందించే సహకారం చారిత్రాత్మకమవుతుందన్నారు. పాలకమండలి సభ్యులు గంగమ్మ మాట్లాడుతూ గిరిజనులను గుర్తించి తనకు అవకాశం ఇప్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బండిఆత్మకూరుకు చెందిన భరధ్వాజశర్మ మాట్లాడుతూ శ్రీశైల ఆదిదంపతులకు సేవ చేసుకునే భాగ్యాన్ని పాలక మండలి సభ్యునిగా మూడోసారి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు, ట్రస్‌బోర్డ్ సభ్యుడు అనిల్‌కుమార్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.