పత్తి రైతులకు వెసులుబాటు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:21 PM
పత్తి రైతుల సమస్యలను సీసీఐ సంస్థ గుర్తించింది. ఉదయం 11 గంటలకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్ రాజు తెలిపారు.
స్లాట్ బుకింగ్‌కు 11గంటలకు పెంచిన సీసీఐ
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతుల సమస్యలను సీసీఐ సంస్థ గుర్తించింది. ఉదయం 11 గంటలకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కోడుమూరు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్ రాజు తెలిపారు. గురువారం పెంచికలపాడులోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు సీసీఐ సంస్థ అమలు చేస్తున్న నిబంధనలు, పత్తిని అమ్ముకోవడానికి కల్పించిన వెసులుబాటును రైతులకు వివరించారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి పత్తి అమ్మకాలపై కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటూ షరతు విధించింది. దీంతో రైతులు ఇళ్లు, పొలాల వద్ద నుంచి సీసీఐ కేంద్రాలకు వచ్చేందుకు సమయం చాలక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం ఉదయం 11గంటల నుంచి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో 50 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి నమోదు చేసుకుంటున్నా కొనుగోలు కేంద్రాలకు మాత్రం తక్కువ మొత్తంలో పత్తిని తీసుకురావడం జరుగుతోందని సెక్రటరీ సుందర్‌రాజు తెలిపారు. దీంతో మిగిలిన రైతులకు అవకాశం లేకుండా పోతోందన్నారు. ప్రతి రైతు ఎంత మొత్తంలో పత్తిని సీసీఐ కేంద్రంలో అమ్మేందుకు కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటారో అంతే మొత్తం పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పత్తిలో 8 శాతం నుంచి 14 శాతం తేమ ఉండేలా రైతులు జాగ్రత్త తీసుకోవాలని రైతులకు సూచించారు.