విద్యార్హతలకు అనుగుణంగా విధులు అప్పగించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:41 AM
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు విద్యార్హతలకు అనుగుణంగా ఆయా శాఖలలో విధులు అప్పగించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆత్మకూరు జేఏసీ కమిటీ సభ్యులు స్వాములు, నారాయణ ఆచారి, రత్నస్వామి, అతావుల్లా, శశి, పోలీసులు పార్వతీబాయి, రోజా బిందు డిమాండ్ చేశారు.
ఆత్మకూరు రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు విద్యార్హతలకు అనుగుణంగా ఆయా శాఖలలో విధులు అప్పగించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆత్మకూరు జేఏసీ కమిటీ సభ్యులు స్వాములు, నారాయణ ఆచారి, రత్నస్వామి, అతావుల్లా, శశి, పోలీసులు పార్వతీబాయి, రోజా బిందు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు ఆత్మకూరు మండల సచివాలయ ఉద్యోగులు శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సయ్యద్ ఉమ్మర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి నిర్వహించే సర్వేలు, ఇతర పనుల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలన్నారు. ఉద్యోగులను ఆయా శాఖల మాతృశాఖలకు అప్పగించాలని, సమయపాలన లేని, ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరు సంవత్సరాల పాటు ఒకే కేడర్‌లో పనిచేసిన సిబ్బందికి ఏఏఎస్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. అన్ని విభాగాల వారికి ప్రమోషన చానల్ ఏర్పాటు చేసి జిల్లాల వారిగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల వివిధ శాఖల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పగిడ్యాల: తమకు పనిభారం తగ్గించాలని సచివాలయ సిబ్బంది శుక్రవారం పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇనచార్జి ఎంపీడీవో నాగేంద్రకుమార్, పంచాయతీ కార్యదర్శి వీరన్నయాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికీ తిరిగి నిర్వహించే సర్వేలు, ఇతర పనుల నుంచి తమకు విముక్తి కలిగించాలన్నారు. తమను మాతృశాఖలకు అప్పగించాలని, ఒత్తిడితో కూడిన విధులు అప్పగించరాదన్నారు. కార్యాలయ పనివేళలు పాటించకుండా వీడి యో కాన్ఫరెన్సలు, సెలవు దినాలలో బలవంతపు విధులు చేయించడం తగదన్నారు. అలాగే ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, అన్ని విభాగాల వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.