తాగునీటి కటకట
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:01 AM
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ప్రజలకు ఇక్కట్లను తెచ్చి పెట్టింది. ప్రజలు ముఖ్యంగా తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు.
50 రోజులుగా సమ్మెలో మున్సిపల్ కార్మికులు
ప్రత్యామ్నాయం అంతంత మాత్రమే
ఇటీవలే నిరసన తెలిపిన మహిళలు
బిందెడు నీటి కోసం కష్టాలు
మంత్రి ఇలాకాలోనే ఎందుకిలా?
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ప్రజలకు ఇక్కట్లను తెచ్చి పెట్టింది. ప్రజలు ముఖ్యంగా తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. మంత్రి ప్రాతినిఽథ్యం వహిస్తున్న కర్నూలు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలు నీళ్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగర పాలక పరిధిలో 1.20 లక్షల నివాసాలు ఉన్నాయి. 52 వార్డుల్లో 6లక్షలకు పైగా జనాభా వుంది. పాత బస్తీలోని అన్ని కాలనీలతో పాటు నగర శివారు కాలనీల్లో సైతం బిందెడు కోసం బోలెడు కష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంత్రి ఇలాకాలో ఇలా జరగడమేమిటని కొందరు విస్తుపోతున్నారు. కాగా ఓ అధికారి కార్మికులను పిలిచి విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం నగర పాలక సంస్థలో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజలు నీటి కష్టాలు తీర్చాల్సి ఉంది.
కర్నూలు న్యూసిటీ, జూన్ 28(ఆంధ్రజ్యోతి): కర్నూలులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగర జనాభా 6లక్షల పై మాటే.. రోజుకు 87 మిలియన్ లీటర్లు తాగునీరు అవసరం. 48 రోజులుగా నగరపాలక పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కార్మికులు జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. శివారు కాలనీల్లో రోజు విడిచి రోజు నీరు వస్తుంది. సమ్మె నేపథ్యంలో వారం రోజులకు ఒక్కసారి కూడ రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిఽథ్యం వహిస్తున్న నగరపాలక పరిధిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లడం ఏమిటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. శివారు కాలనీలతో పాటు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఉస్మానియా కళాశాల సమీపంలోని లావుబాలిదర్గా వద్ద ఉండే స్థానిక ముస్లిం మహిళలు నెల రోజుల నుంచి తాగునీరు రావడం లేదని నగర పాలక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
కర్నూలు నియోజకవర్గ పరిధిలోని..
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలోని కొత్తపేట, బంగారుపేట, ఉస్మానియా కళాశాల, ఖండేరి, పెద్దపడఖానా, మాసుంబాష దర్గా, తెలుగువీధి, జొహరాపురం, పింజరి గేరి, గౌలిగేరి, బుధవారపేట, పూలబజార్, మండిబజార్ ప్రాంతాల్లో నీటి కష్టాలు అధికమయ్యాయి. నగర పాలక పరిధిలో 1.20లక్షల నివాసాలు ఉన్నాయి. 52 వార్డుల్లో 6లక్షలకు పైగా జనాభా వుంది. ఇప్పటికే శివారు కాలనీలు గణేష్‌నగర్, ధనలక్ష్మీనగర్, శరీన్‌నగర్, కృష్ణానగర్, లేబర్‌కాలనీలతో పాటు నగరంలో విలీనమైన స్టాంటన్‌పురం, మునగాలపాడు, మామిదాలపాడు, తదితర ప్రాంతాల్లో రెండు రోజులకు ఒక్కసారి కూడా తాగునీరు సరఫరా చేయడం లేదు. అదికూడా ఒక గంటకు మించి ఇవ్వడంలేదు. బిందెడు నీళ్లు దొరికితే చాలు మహాప్రభో.. దాహం తీర్చుకుం టాం అంటూ ఆయా కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, డబ్బు ఉన్న బడాబాబులు ఆర్వో ప్లాంట్ నుంచి 20లీటర్ల శుద్ధి చేసిన నీటి ట్యాంక్‌ను రూ.15-20లకు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదలు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి సగటు జీవికి కుళాయి నీరే ఆధారం. కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
మంత్రి ఇలాకాలో ఇదేమిటని..
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఎలాగైనా సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని నగరపాలక అధికారులు కార్మికు లను బెదిరించడంతో పాటు నోటీసులు జారీ చేస్తున్నారు. మంత్రి ఇలాకాలో ఇలా జరగడ మేమిటని కొందరు విస్తుపోతున్నారు. మంత్రి చొరవ తీసుకుని సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే అవకాశముంది. రాష్ట్రంలోని 75శాతం నగర పాలక, మున్సిపాలిటీల్లో మాత్రమే కార్మికు లు సమ్మెలో ఉన్నారు. మిగిలిన 25శాతం మున్సిపాలిటీల్లో కార్మికులు యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. చిత్లూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా తాడిపత్రిలో కార్మికులు విధుల్లో కొనసాగుతున్నారు. మంత్రి ఉన్న ప్రాతనిథ్యం వహిస్తున్న కర్నూలు నగర పాలకలో కార్మికులు సమ్మె చేపట్టారు.
ఓ అధికారి బెదిరింపులు
నగర పాలక కార్యాలయంలో ఓ అధికారి కార్మికులను తన చాంబర్‌కు పిలిపించుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజలకు సకా లంలో సేవలను అందించడానికి కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని, అలా చేరకపోతే కొత్తవ్యక్తులను నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకుం టామని ఆ అధికారి కార్మికులను హెచ్చరించారు. ప్రజలకు ప్రాథమిక సేవలను అందించడంలో అంతరాయాలను నివారిం చడానికి గైర్హాజరైన వ్యక్తుల స్థానంలో వారిని అప్కాస్‌లో నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
బోరింగులే దిక్కు..
నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు బోరింగులను ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు ప్రైవేటు ట్యాంకర్లను రూ.400 నుంచి రూ.500 వెచ్చించి తెప్పించుకుంటున్నారు. ఈ లెక్కన కార్మికులు సమ్మె విరమించకపోతే ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదముంది.
అంతంత మాత్రంగానే..
ప్రత్యామ్నాయ చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అశోక్‌నగర్‌లోని నీటి శుద్ధికేంద్రంలో సుమారు 30 నుంచి 40 మంది కార్మికులు పని చేసేవారు. అందరూ సమ్మెలోకి వెళ్లడంతో 12మంది ప్రైవేటు వ్యక్తులతో నీటి శుద్ధి కేంద్రంలో పని చేయిం చుకుంటు న్నారు. 52 వార్డులకు 8మంది ట్యాప్ ఇన్‌స్పెక్టర్లు, 15 మంది మోటార్ ఫిట్టర్లు, 70 మంది కుళాయి టర్న్ కాకర్లు( వీళ్లు నగరంలో ప్రతి వీధిలో వాల్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసే వాళ్లు). వీరంతా సమ్మెలో ఉన్నారు. దీంతో ప్రత్యామ్యాయంగా ప్రైవేటు వ్యక్తులకు తీసుకుని వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే ఇదంతా చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అరకొరగా ట్యాంకర్లను..
నగరంలోని కొన్నిప్రాంతాలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పూర్తిగా తాగునీటి కష్టాలు ఎక్కువగా ఉండే నగరంతో పాటు శివారు కాలనీలకు అరకొరగా ట్యాంకర్లను పంపిస్తున్నారు. ప్రధానంగా ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలోకి వెళ్లడంతో ప్రైవేటు వ్యక్తులను వినియోగించుకుంటున్నారు.
విధుల నుంచి తొలగిస్తాం
ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే విధుల తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెలో ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులు, డీఈలు, ఏఈలు, అమ్యూనిటీస్ సెక్రటరీలతో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. లేబర్ పని చేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులను రోజువారి కూలీ ఇచ్చి పనులు చేయించు కుంటున్నాం. కార్మికుల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కార్మికులు విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎస్.రవీంద్రబాబు, కమిషనర్, కర్నూలు నగరపాలకసంస్థ
గంటల తరబడి ఎదురుచూస్తున్నాం
తాగునీరు ఎప్పుడు వదులుతారో తెలియదు.. ఎంతసేపు వస్తాయో తెలియక గంటల తరబడి ఎదురుచూస్తున్నాం. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఒక ఇంటికి నీరు వస్తే నాలుగు ఇళ్లకు రావడం లేదు.
రామమ్మ, కొత్తపేట, కర్నూలు
నీళ్ల సమస్య లేని కాలనీల్లో కూడా..
నగరంలో ఎప్పుడూ నీళ్ల సమస్య లేని కాల నీల్లో ఇప్పుడే ఎందుకు వచ్చింది. నీళ్ల ట్యాంకు, నగరపాలక సంస్థ కార్యాలయానికి సమీపంలో ఉన్న కాలనీల్లో కూడా తాగునీటి సమస్య వస్తుంది. కొన్ని కాలనీల్లో ఒక ప్రాంతానికి ఎక్కువ ఒక ప్రాంతానికి తక్కువ నీరు సరఫ రా అవుతుంది. ఇంటి పన్నులు, కుళాయి పన్ను లు చెల్లిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కూడ అందించకపోతే ఎలా?
ఇరిగినేని పుల్లారెడ్డి, పీపీఎస్‌ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు