Share News

గొంతెండుతున్న ఆలూరు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:44 PM

పట్టణంలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గమైన ఆలూరు జనాభా 27వేల పైచిలుకే. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇటు ప్రజా ప్రతినిధులకు గాని, అటు అధికారులకు గాని సరైన ప్రణాళిక లేదు.

గొంతెండుతున్న ఆలూరు
బాపురం రిజర్వాయర్‌లో అడుగంటిన నీరు

15 రోజులుగా తాగునీరు లేదు

ప్రణాళిక లేని అధికారులు, ప్రజా ప్రతినిధులు

మరో రెండు ఎస్‌ఎస్‌ ట్యాంకులు నిర్మిస్తే శాశ్వతంగా పరిష్కారం

ఆలూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గమైన ఆలూరు జనాభా 27వేల పైచిలుకే. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇటు ప్రజా ప్రతినిధులకు గాని, అటు అధికారులకు గాని సరైన ప్రణాళిక లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండటంతో ఇక్కడ ఉండేందుకు ఉద్యోగులు కూడా ఆసక్తి చూపడం లేదు. దూర ప్రాంతాలైన కర్నూలు, ఆదోని, గుంతకల్‌ నుంచి వచ్చి ఇక్కడ విధులు ముగించుకుని వెళుతున్నారు.

ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే..

పట్టణ జానాభా పెరుగుతున్నా వీరి అవసరాలకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉ న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 8 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. దీంతో పాటు లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ఎస్‌ఎస్‌ ట్యాంకు ఉంది. 40 ఏళ్ల క్రితం అప్పటి జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన తాగునీటి పథకాలే ఇప్పటికీ శరణ్యం. ఆలూరుతోపాటు 22 గ్రామాలకు బాపురం రిజర్వా యర్‌ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. అయితే 20 కి.మీ.ల దూరంలో ఉన్న బాపురం రిజర్వాయర్‌లో నీరు అడుగంటింది. దీనికితోడు నిత్యం సాంకేతిక కారణాలు, లీకేజీలు, మరమ్మతులు, పైపులైన్లు పగిలిపోవడంతో తాగునీరు అందడం లేదు. 15 రోజులుగా పట్టణ ప్రజలకు తాగునీరు అందడం లేదు. ప్రజలకు సమాధానం చెప్పలేక వాటర్‌మెన్లు మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటున్నారు.

ఎల్‌ఎల్‌సీకి నీరు వస్తేనే

ఎల్‌ఎల్‌సీ కాలువలకు నీరు వస్తేనే తిరిగి సమస్య పరిష్కారమ్యే అవకాశం ఉంది. తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తుగా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, ఆలూరు వద్ద మరో రెండు స్టోరేజ్‌ ట్యాంకులు ర్మిస్తేనే ససమ్య పరిష్కారం అవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకుతో పాటు ఆలూరు చెరువులో ఒక్కటి, అరికెర రోడ్డులో మరొకటి నిర్మించాలని ప్రజలు కోతున్నారు. ఎల్లెల్సీ నీటితో ఆలూరు, హుళేబీడు చెరువులను నింపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ముందస్తు ప్రణాళిక లేకపోవడమే

అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడమే తాగునీటి సమస్యకు కారణం. బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచి, మరో రెండు ఎస్‌ఎస్‌ ట్యాంకులు నిర్మించాలి. నిరుపయోగంగా ఉన్న ఆలూరు చెరువును నింపితే సమస్య పరిష్కారమవుతుంది. - దేవేంద్రప్ప, మాజీ జడ్పీటీసీ

లీకేజీలతో తాగునీటి సరఫరాకు ఆటంకం

తరచూ పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీలతో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. బాపురం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపో యాయి. దీంతో అక్కడ నుంచి నీటిని పంపింగ్‌ చేయడానికి సమయం పడుతుంది. ఎలాంటి సమస్యలు లేకుంటే వారానికోసారి నీరు సరరా చేస్తాం. - ప్రభాకర్రావు, డిప్యూటీ ఎంపీడీవో, ఆలూరు

Updated Date - Jul 06 , 2025 | 11:44 PM