Share News

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:13 AM

జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

జూన్‌లోగా పంట కుంటల నిర్మాణాలను పూర్తి చేయాలి

రీ సర్వేలో తప్పులు చేస్తే చర్యలు

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఉపాధి హామీ, తాగునీరు, రీసర్వే, గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలు, పీజీఆర్‌ఎస్‌ అంశాలపై స్పెషల్‌ ఆఫీసర్లు, డివిజన్‌ మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాని గోనెగండ్ల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈకి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో ముమ్మరంగా ఉపాధి హామీ పనులను కల్పించి 90 శాతం లక్ష్యాన్ని సాధించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 8,500 పంట కుంటలు నిర్మించడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5,661 నిర్మాణాలకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 1268 ప్రోగ్రెస్‌లో ఉన్నాయని, 437 పూర్తయ్యాయని అన్నారు. జూన్‌లోపు పంట కుంటల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పనులు పూర్తి చేసిన వెంటనే సర్టిఫికెట్‌ పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో వెంకటనారాయణమ్మ, డ్వామా పీడీ వెంకటరమణయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:13 AM