Share News

బిందె నీటి కోసం.. బండెడు కష్టాలు

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:42 AM

తాగునీరందక కోడుమూరు పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 రోజులుగా సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు బిందెలు పట్టుకుని తిరుగుతున్నారు. పట్టణానికి ప్రధాన వనరు అయిన హంద్రీనదిలో వేసిన పైపులైన్లు అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి.

బిందె నీటి కోసం.. బండెడు కష్టాలు
ట్యాంకు వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు, సైకిల్‌పై నీరు తెచ్చుకుంటున్న యువకుడు

కోడుమూరులో తాగునీరు అందక ప్రజల అవస్థలు

అధిక వర్షాలతో హంద్రీ నదిలో కొట్టుకుపోయిన పైపులైన్లు

జీడీపీ నుంచి ప్రత్యేక పైపులైన్‌ వేస్తే పరిష్కారమయ్యే అవకాశం ఫ పట్టించుకోని గత ఎమ్మెల్యేలు

కోడుమూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తాగునీరందక కోడుమూరు పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 రోజులుగా సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలు బిందెలు పట్టుకుని తిరుగుతున్నారు. పట్టణానికి ప్రధాన వనరు అయిన హంద్రీనదిలో వేసిన పైపులైన్లు అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో తాగునీటి సరఫరా ఆగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని కోటవీధి, పెద్దబోయగేరి, బీసీకాలనీ, చిన్నబోయగేరి, ఆకులవీధి, గొల్లగేరి, చాకలి వీధి, షణ్ముఖనగర్‌ తదితర కాలనీల్లో ఇదే పరిస్థితి.

హంద్రీ నీరే గతి..

సుమారు 45వేల జనాభా ఉన్న కోడుమూరు పట్టణ ప్రజలకు తాగునీటికి హంద్రీనదిలో వేసిన తాగునీటి పైపులైన్లే గతి. అక్కడి నుంచి పైపు లైన్లదారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు పట్టణంలో దాదాపు 8 వరకు ఓవర్‌హెడ్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. అయితే అధిక వర్షాలకు హంద్రీ నది నిండి, పైపులైన్లు కొట్టుకుపోవడంతో సమస్య ఉత్పన్నమైంది.

హంద్రీలో ఎక్కువ నీరున్నా, ఎండినా సమస్యనే..

హంద్రీనదిలో నీటి ఉధృతి పెరిగితే పైపులైన్లు కొట్టుకుపోయి సమస్య వస్తుంది. అయితే నది పూర్తిగా ఎండిపోతే నీటి నిల్వలు లేక తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. నది ఎండిపో యిన ప్రతిసారి జీడీపీ లేదా ఎల్లెల్సీ నుంచి నదికి నీటిని విడుదల చేయించుకొని తాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రజలు నిత్యం మినరల్‌ వాటర్‌ కొనాల్సి వస్తోంది.

హామీ నెరవేర్చని గత ఎమ్మెల్యేలు

పట్టణంలోని తాగునీటి సమస్య తీరాలంటే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ వేయాలి. ఇలా చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు హామీ ఇచ్చి, గెలిచిన అనంతరం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2009 నుంచి ఇలాగే అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత టీడీపీ బొగ్గుల దస్తగిరి స్పందించి జీడీపీ నుంచి పైపులైన్‌ వేయించి తమ సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

నెల నుంచి ఇబ్బంది పడుతున్నాం

నెల రోజులుగా తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నాం. తప్పని పరిస్థి తుల్లో శుద్ధజలం(మినరల్‌ వాటర్‌)ను కొనుగోలు చేస్తున్నాం. దసరా రోజు మాత్రమే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ వద్ద నీరు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులు స్పందించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. - లక్ష్మణస్వామి, కోటవీధి, కోడుమూరు

Updated Date - Oct 07 , 2025 | 12:42 AM