నకిలీ విత్తనాలతో ముంచారు
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:09 AM
మొక్కజొన్న సాగు కోసం లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టారు. ఎంతో విశ్వాసంతో విత్తనాలు కొనుగోలు చేశారు. ధనార్జనే ధ్యేయంగా కొన్ని దుకాణాలు రైతులను నిలువునా ముంచాయి. నకిలీ విత్తనాలతో రైతులు నట్టేట మునిగిపోతున్నారు. నిత్యం పత్తి, మిరప రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయేవారు. ఇప్పుడు మొక్కజొన్న రైతు కూడా వారి సరసన చేరారు. నకిలీ విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారంటూ నందికొట్కూరు రైతులు రోడ్డెక్కారు. ఆయా కంపెనీలు, దుకాణాలపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక్కొక్క మొక్కకు ఐదు కంకులు
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు
నందికొట్కూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎంతో నమ్మకంతో మొక్కజొన్న విత్తనాలను కొనుగోలుచేసిన రైతులను కొన్ని దుకాణాలు నకిలీలతో నిలువునా ముంచాయి. గురువారం నందికొట్కూరు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పట్టణంలోని ర్యాలీ నిర్వహించి, పటేల్ సెంటర్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులు చేపట్టిన ఆందోళనకి వామపక్ష పార్టీల నాయకులు నరసింహులు, రఘురాంమూర్తి, నాగేశ్వర రావు, పక్కీర్‌సాహెబ్, వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. రైతుసంఘం నాయకుడు రవి శెట్టి మాట్లాడుతూ జూన్, జూలై నెలల్లో శ్రీపల్లవి హైబ్రిడ్ సీడ్స్, శ్రీవెంకటేశ్వర విత్తనాల దుకాణంలో జిల్135, మరికొన్ని దుకాణాల్లో కార్గిల్ 9133 రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేశారన్నారు. ఈ విత్తనాలతో ఒక్క నందికొట్కూరులోనే 500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభంలోనే విత్తనా లను నాటామని సరైన వర్షాలు కురవడంతో దిగుబడుగులు ఆశాజనకంగా ఉంటా యనుకుంటే ఒక్కొక్క మొక్కకు ఐదు కంకులొచ్చాయని, అందులో ఏఒక్క కంకికి కూడా విత్తనాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నకిలీ విత్తనాలు అందజేసిన దుకాణం, కంపెనీలపై చర్యలు తీసుకోవాలని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ చంద్రశేఖర్ ఏవో షేక్షావలిని పిలిపించి పొలాలను పరిశీలించారు.
పదేపదే మోసం చేస్తున్నా..
శ్రీపల్లవి హైబ్రిడ్ దుకాణం నకిలీ విత్తనాలను అందజేస్తూ తమను పదేపదే మోసం చేస్తోందని రైౖతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా వరి, మినుములు, మిరప, మొక్కజొన్న నకిలీ విత్తనాలను కొనుగోలుచేసి మోసపోయామని రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసిన దాఖలాలున్నాయి. జిల్ 135 కంపెనీ డీలర్‌షిప్ ఉన్నది వెంకటేశ్వర విత్తనాల దుకాణానికి ఉండగా శ్రీపల్లవి హైబ్రిడ్ దుఖాణంలో కూడా ఇదే కంపెనీ విత్తనాలను రైతులకు అమ్మడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ షాపుపై వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమిటో తెలియడం లేదు.
4 లక్షలు పెట్టుబడి పెట్టా
పది ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నా. జిల్ 135రకం మొక్కజొన్న విత్తనాలు నాటా. మొత్తం 10ఎకరాలకు రూ.4లక్షలు ఖర్చు చేశా. ఒక్కొక్క చెట్టుకు నాలుగు, ఐదు కంకులు వచ్చాయి. ఈ విత్తనంతో పూర్తిగా నష్టపోయా. ఉశేనమ్మ, రైతు, నందికొట్కూరు
రైతులకు న్యాయం జరిగేలా చూస్తా
రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. విత్తనాల దుకాణాల యజమానుల ద్వారా కంపెనీలను ఇక్కడికి పిలిపిస్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. షేక్షావలి, ఏవో, నందికొట్కూరు