ఆ ప్రాజెక్టుల్లో పని చేయం
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:34 AM
ఆ ప్రాజెక్టుల్లో పని చేయం
శ్రీశైలం, వెలుగోడు ప్రాజెక్టుల్లో విధి నిర్వహణకు ఇష్టపడని ఇంజనీర్లు
ఉమ్మడి జిల్లాలో 201 ఏఈఈ పోస్టులు ఖాళీ
అరకొర పనులున్న డివిజన్లలో పోస్టింగ్ కోసం ఆరాటం
ఏఈఈల బదిలీలకు సిఫారసు లేఖలు ఇస్తున్న ఎమ్మెల్యేలు
లస్కర్లతో నెట్టుకొస్తున్న ఉన్నతాధికారులు
పంట కాలువల నిర్వహణ, నీటి పంపిణీలో ఏఈఈల పాత్ర కీలకం. అయితే ఉమ్మడి జిల్లాలో 201 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే సాగునీటి ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు ఇంజనీర్లు ఆసక్తి చూపడం లేదు. శ్రీశైలం, వెలుగుగోడు ప్రాజెక్టులు, ఆదోని మైనర్ ఇరిగేషన్‌లో విధులు నిర్వహించేందుకు ఏఈఈలు ఆసక్తి చూపడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని మూడు సబ్ డివిజన్లలో 34 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు వెలుగోడు డివిజన్, ఆదోని మైనర్ ఇరిగేషన్ సబ్ డివిజన్‌లో ఒక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఏఈఈ) కూడా లేరు. లస్కర్లు కాలువల నిర్వహణ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి కాలువలు నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కర్నూలు, మే 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఆర్‌బీసీ), కర్నూలు-కడప (కేసీ) కెనాల్, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ).. వంటి ప్రధాన సాగునీటి వనరులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో దాదాపుగా 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. వీటితో పాటు చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని వివిధ చెరువుల ద్వారా సుమారుగా 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టులు, కర్నూలు ఎంఐ డివిజన్ పరిఽధిలో 399 మంది ఏఈఈ పోస్టులు ఉన్నాయి. అందులో 198 స్థానాలు భర్తీ చేయగా.. 201 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 49.62 శాతం పోస్టులే భర్తీ చేశారు. వివిధ ప్రాజెక్టుల్లో పరిధిలోని డివిజన్, సబ్ డివిజన్లలో ఆనిష్పత్తి ప్రకారం పోస్టులు భర్తీ చేశారేమో అను కుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. కీలకమైన సాగునీటి కాలువలు పర్యవేక్షించే డివిజన్లలో ఒక్క ఏఈఈ కూడా లేరు. ఇలాగైతే ఖరీఫ్ సీజన్‌లో నీటి నిర్వహణ ఎలా సాధ్యం..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వామ్మో.. శ్రీశైలం డ్యాంకా..?
శ్రీశైలం డ్యాంలో.. తెలుగుగంగ ప్రాజెక్టు వెలుగోడు ప్రాజెక్టుల్లో ఇంజనీర్‌గా విఽధులు నిర్వహించం.. మాకు ఎమ్మెల్యేల, ఎంపీల సపోర్టు ఉంది.. అని కొందరు ఇంజనీర్లు అంటున్నారు. తాము అడిగిన ప్లేస్ ఇవ్వాలని పలువురు ఇంజనీర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో బదిలీకి దరఖాస్తు పెట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఎంపీ సహా ఆ పార్లమెంట్ పరిధిలో ఉండే ఆరేడుగురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. చేతి నిండా పనులుండి.. నెలనెల వాటా రూపంలో డబ్బులు వచ్చే డివిజన్లు, లేదంటే ఎలాంటి పనులు లేకుండా రియల్ ఎస్టేట్ వంటి ప్రైవేటు వ్యాపారాలు చేసుకోవడానికి వీలైన క్వాలిటీ కంట్రోల్, గేజింగ్, జిల్లా కేంద్రాలకు దగ్గర ఉండే డివిజన్లలో పోస్టింగ్ కోసం పైరవీలు చేస్తున్నారు. వారికే ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించే జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పరిధిలో శ్రీశైలం డ్యాం నిర్వహణ సర్కిల్, సీ అండ్ బీ డివిజన్, డ్యాం నిర్వహణ.. వంటి మూడు డివిజన్లు ఉన్నాయి. వీటిలో 44 ఏఈఈ పోస్టులు ఉంటే 10 పోస్టులే భర్తీ చేశారు. 34 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నైరుతి పవనాలు ముందుగానే రావడంతో డ్యాంకు జూన్‌లో వరద చేరే అవకాశాలు ఉన్నాయి. 2009 నాటి వరద వస్తే కరువు రైతుల ప్రాణనాడి అయిన శ్రీశైలం డ్యాం రక్షణ ఎలాసాధ్యం..?. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ ప్రాజెక్టు భద్రత పట్టదా..?. ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. నంద్యాల, కడప జిల్లాకు ఎన్టీఆర్ తెలుగుగంగ కాలువ ద్వారా కృష్ణాజలాలు మళ్లించాలంటే వెలుగోడు జలాశయం ఎంతో కీలకం. టీజీపీ వెలుగోడు డివిజన్ పరిధిలో 17 ఏఈఈ పోస్టులు ఉంటే ఒక్క ఏఈఈ కూడా లేరు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌ఆర్‌బీసీ బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల డివిజన్లది దాదాపు ఇదే పరిస్థితి.
క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) కర్నూలు డివిజన్‌లో 12 ఏఈఈ పోస్టులకు గాను 10 పోస్టులు భర్తీచేశారు. క్యూసీ నంద్యాల డివిజన్‌లో 12 పోస్టులకు గాను 9 పోస్టులు భర్తీ చేశారు. కర్నూలు ప్రాజెక్ట్స్ పరిఽధిలోకి వచ్చే అనంతపురం క్యూసీ డివిజన్‌లో 12 పోస్టులకు 11 పోస్టులు భర్తీ చేశారు. అంటే.. ఈ మూడు డివిజన్లలో 23 ఏఈఈ పోస్టులు ఉంటే.. 30 పోస్టులు భర్తీ చేశారు. ఇలాంటి డివిజన్లు చాలానే ఉన్నాయని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాలకు దగ్గరగా ఉంటూ ఎలాంటి పనులు లేని డివిజన్లలో పోస్టింగ్‌ల కోసం పలువురు ఏఈఈలు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏఈఈలకు డీఈఈగా పదోన్నది ఇవ్వడంతో మెజార్టీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి పంపిణీకి చర్యలు చేపట్టాలని పలువురు పేర్కొంటున్నారు. లేదంటే.. లస్కర్లే ఇంజనీర్లుగా విధులు నిర్వర్తించక తప్పదని ఓ ఎస్‌ఈ పేర్కొనడం కొసమెరుపు.
వివిధ ప్రాజెక్టు పరిధిలో ఏఈఈ పోస్టులు, ఖాళీలు వివరాలు
ప్రాజెక్టు/కాలువలు డివిజన్లు ఏఈఈ భర్తీ ఖాళీలు
పోస్టులు చేసినవి
శ్రీశైలం డ్యాం 4 54 16 38
తెలుగుగంగ ప్రాజెక్టు 6 72 29 43
ఎసార్బీసీ సర్కిల్-1 నంద్యాల 7 96 69 27
ఎసార్బీసీ సర్కిల్-2 నంద్యాల 5 71 12 59
క్వాలిటీ సెల్ 3 36 30 6
మొత్తం 22 329 156 173
కేసీ కెనాల్ డివిజన్ 4 20 15 5
టీబీపీ ఎల్లెల్సీ డివిజన్ 4 20 15 5
గురురాఘవేంద్ర ప్రాజెక్టు 3 12 2 10
ఎం కర్నూలు డివిజన్ 5 18 10 8
మొత్తం 38 399 198 201
ప్రభుత్వానికి నివేదిక పంపాం
ఉమ్మడి ఇల్లాలో వివిధ ప్రాజెక్టు పరిధిలోని డివిజన్ల వారిగా ఏఈఈ పోస్టులు ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపించాం. కీలకమై శ్రీశైలం డ్యాం, ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు వెలుగోడు, ఆళ్లగడ్డ డివిజన్లలో ఏఈఈ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నమాట నిజమే. బదిలీలలో ప్రభుత్వం వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది.
- కబీర్‌బాషా, సీసీ, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్, కర్నూలు