సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - May 12 , 2025 | 11:50 PM
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ నవ్య
కర్నూలు కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి రీ ఓపెన్ కేసుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి కర్నూలు ఆర్డీవో వద్ద 23, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 23, పత్తికొండ ఆర్డీవో వద్ద 7, సర్వే ఏడీ వద్ద 2, వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో వెళ్లకుండా పరిష్కరించాలన్నారు.
‘కౌలు రైతులను గుర్తించాలి’
గ్రామ సభల ద్వారా అర్హులైన కౌలు రైతులను గుర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్ జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లకు సూచించారు. 25వేల సీసీఆర్‌సీ కార్డుల జారీ చేయాలని జిల్లాకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగానే అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి సీసీఆర్‌సీ కార్డులు ఇప్పిస్తే వారు ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకోకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసుకునేందుకు షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలని, అదేవిధంగా గ్రామ సభలు ఎప్పుడు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. దేవదాయశాఖ, వక్ఫ్‌శాఖల అధికారులు కూడా ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.