శ్రీగిరి వైభవానికి భంగం కలిగించొద్దు
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:55 PM
శ్రీశైల క్షేత్ర వైభవానికి, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరించవద్దని ఆలయ భద్రతా అధికారి శ్రీనివాసరావు యాత్రికులకు అవగాహన కల్పించారు.
యాత్రికులకు సీఎస్‌వో శ్రీనివాసరావు సూచన
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆలయ సెక్యూరిటీ
శ్రీశైలం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల క్షేత్ర వైభవానికి, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరించవద్దని ఆలయ భద్రతా అధికారి శ్రీనివాసరావు యాత్రికులకు అవగాహన కల్పించారు. శనివారం వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలను పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే యాత్రికులు పొరపాటున కూడా నిషేధిత వస్తువులను తమవెంట తీసుకు రాకూడదన్నారు. దేవస్థాన నిబంధనలు ఉల్లంఘంచి క్షేత్ర పరిధిలో అ సాంఘిక కార్యకలాపాలు, అన్యమత ప్రచారాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దేవదాయ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్షేత్ర పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు, పాతాళగంగ పరిసర ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, నిత్యాన్నదాన సత్రాలు, మాడవీధులు తదితర ప్రధాన కూడళ్లను మొబైల్ పార్టీతో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.