కట్టలు కట్టలే..!
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:29 AM
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీకి హద్దు లేకుండా పోతోంది. ఆయా కార్యాలయాల వారీగా ఎక్కడికక్కడ దోచేస్తున్నారు.

సాయంత్రమైతే జేబుల నిండా డబ్బులే
రిజిస్ట్రేషన్ శాఖలో పెరిగిపోతున్న అవినీతి
రోజుకు రూ.లక్షల్లో అక్రమ ఆదాయం
లంచం ఇస్తేనే క్రయ, విక్రయాలు పూర్తి
నేరుగా పోతే మాత్రం కొర్రీలే..!
సస్పెండ్ అవుతున్నా కనిపించని మార్పు
నంద్యాల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీకి హద్దు లేకుండా పోతోంది. ఆయా కార్యాలయాల వారీగా ఎక్కడికక్కడ దోచేస్తున్నారు. క్రయ విక్రయదారుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పతున్నారు. కొందరు డాక్యుమెంట్ రైటర్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఏసీబీ దాడులతోపాటు శాఖ పరమైన చర్యలు తీసుకున్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లలో మాత్రం మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్రమ వసూళ్ల దందా కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మామూళ్లు సమర్పించుకుంటే తప్ప ఫైల్ కదలడం లేదని కొందరు బాధితులు వాపోతున్నారు. ఎంతోకొంత ఇస్తే తప్ప అధికారులు, సిబ్బంది పని చేయడం ఆరోపిస్తున్నారు. కొందరు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కొందరు డాక్యుమెంట్ రైటర్లు సిండికేట్‌గా మారి క్రయవిక్రయ దారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది.
పది శాతం ఇవ్వాల్సిందే...
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రధానంగా మూడు రకాలైన క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. సేల్ డీడ్, దాన ధర్మం, భాగ పరిష్కార రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. వీటిలో ఏ పని కావాలన్నా మామూళ్లు చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాలయ సిబ్బంది, కొంత మంది దస్తావేజు లేఖరులు ప్రత్యేక పర్సంటేజీలు ఖరారు చేశారు. అధికారుల కోసమని సేల్ డీడ్‌కు- 3 నుంచి 5 శాతం, దాన ధర్మం - 1 నుంచి మూడు శాతం, భాగ పరిష్కారం- 2 నుంచి ఐదు శాతం చొప్పున అదనంగా వసూళ్లు చేసి దోపిడీకి గురి చేస్తున్నారని బాధిత వర్గాల నుంచి తెలిసింది. అదేవిధంగా ఏదైనా ప్లాట్, స్థలం కొనుగోలు చేస్తే వాటి విలువను తక్కువగా లెక్కిస్తే ఐదు నుంచి పది శాతం వరకు సమర్పించుకోవాల్సిందే. క్రయ విక్రయదారులు మామూళ్లు ఇవ్వకపోతే నిబంధనల పేరుతో వివిధ రూపాల్లో కొర్రీలు విధించి వెనక్కి పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంపుల రూపంలో (సదరు భూమి, స్థలం మార్కెట్ విలువలో రూ. లక్షకు.. 7.5 శాతం చొప్పున) రూ.7500 చలానా తీయాల్సి ఉంది. ఆయితే కానీ నిబంధనలు అటు ఇటు ఉండటం, రిజిస్ట్రేషన్ గురించి తెలియని వారు దళారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా వస్తే ఈ చలానా ఏకంగా రూ.20 వేల వరకు పెంచి మరీ వసూళ్లు చేస్తున్నారని సమాచారం. వీటికితోడు ఈసీలు, నకల్లు, వివాహ ధ్రువీకరణ పత్రాలు తదితర పత్రాల రూపంలో తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మరీ దారుణం. ఎవరైనా రిజిస్ట్రేషన్ సమయంలో ఒప్పందం ప్రకారం అడిగినంతా కాకుండా తక్కువ ఇస్తే మాత్రం అంతే సంగతులు. సదరు క్రయ విక్రయదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత డాక్యుమెంట్‌లు కంప్యూటీకరణ చేయకుండా పెండింగ్‌లో పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల వారిగా ...
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిరోజూ జరిగే రిజిస్ట్రేషన్లను బట్టి వసూళ్లు చేస్తున్నారు. రోజుకు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో మరింత ఎక్కువగాను.. తక్కువగా జరిగే ప్రాంతాల్లో కొంచెం తక్కువగా అక్కడ పరిస్ధితిని బట్టి అక్రమ వసూళ్లకు తెరలేపారు. ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లకు తోడు బయటి వ్యక్తుల ద్వారా దస్తావేజు తయారు చేసేందుకు రూ.4 నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేస్తుంటారు. అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ అనధికారికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి ఇవ్వాలంటూ అదనంగా రూ.3 నుంచి రూ.5 వేలు వసూళ్లు చేస్తూ రోజుకు రూ.లక్షల్లో అవినీతి సొమ్మును మూట గట్టుకుంటున్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వీటికి రెట్టింపు స్థాయిలో వసూళ్లు చేస్తున్నారని సమాచారం.
ఫిర్యాదులు మా దృష్టికి రాలేదు..
సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు మా వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. క్రయ విక్రయదారులు ఎవరైనా ఇలాంటి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. డాక్యుమెంట్ రైటర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. ఈసీ, నకల్లు, వివాహ ధ్రువీకరణ తదితర పత్రాల కోసం నిబంధనలు ప్రకారం సేవలందించేలా చూస్తాం. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా ప్రత్యేక దృష్టి పెడుతాం.
- జానకిదేవి, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలిసింది. ఈసీ, నకల్లు, వివాహా ధ్రువపత్రాల మంజూరులోనూ నిబంధనల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని బాధిత వర్గాల ఆరోపణ. కొందరు బయటి వ్యక్తుల ద్వారా ఓ అధికారి సాయంత్రం కాగానే ఆ రోజు జరిగిన రిజిస్ట్రేషన్ల పరంగా లెక్కకట్టి పంపకాలు చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా సమాచారం.
జూపాడుబంగ్లా మండలానికి చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం గత వారంలో నందికొట్కూరు కార్యాలయానికి వెళ్లారు. వెంటనే స్టాంప్ చలానా రూ.60 వేలు తీయమన్నారు. ఆ తర్వాత అదనంగా ఓ రైటర్ రూ.20 వేలు తీసుకున్నారు. ఇలా నిత్యం అక్కడ సిబ్బంది.. కొందరు రైటర్లు కుమ్మక్కై అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. కింది స్థాయి సిబ్బందిలో ఒకరు సాయంత్రం కాగానే వసూళ్లు చేసుకొచ్చి అందజేస్తున్నట్లు తెలిసింది.
బనగానపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముడుపులు ఇస్తే తప్ప పనులు జరగడం లేదని తెలుస్తోంది. ఎవరైనా నేరుగా వెళ్తే వివిధ రూపాల్లో కొర్రీలు విధిస్తున్నారని సమాచారం. ముడుపులు చెల్లిస్తే ఆ తర్వాత సాఫీగా రిజిస్ట్రేషన్ పక్రియ జరుగుతుందని బాధిత వర్గాల ఆవేదన. ఒక్కొక్క రిజిస్ట్రేషన్‌కు రూ.3 నుంచి రూ.5 వేలు బయటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే కార్యాలయంలో పని చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండైనా అవినీతి అక్రమాలు మాత్రం ఆగడం లేదు.
అవుకు, కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగానే సాగుతున్నాయి. అవుకులో అయితే డాక్యుమెంట్ రైటర్లు రెండు వర్గాలుగా విడిపోయి సాయంత్రం కాగానే జరిగిన వసూలు చేసిన మామూళ్లను సంబంధిత అధికారికి ముట్టచెప్పుతారని సమాచారం. గతంలో ఇక్కడ ఓ జూనియర్ అసిఐస్టెంట్ ఏసీబీ వలకు చిక్కారు.
డోన్ సబ్ రిజిస్ట్రార్ తీరుపై పలు రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏ పని కోసం వచ్చినా పైసలు ఇవ్వందే పని చేయరనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ 15 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉండగా వీరిలో ఒక డాక్యుమెంట్ రైటర్ ద్వారా సదరు సబ్ రిజిస్ట్రార్ లోగుట్టు వ్యవహారం నడిపిస్తున్నారని తెలిసింది. రోజువారిగా జరిగిన రిజిస్ట్రేషన్ల పరంగా సదరు డాక్యుమెంట్ రైటర్ మిగిలిన వాళ్లతో వసూలు చేసుకొని వచ్చి సదరు అధికారికి అందజేసే విధంగా వ్యవహారం సాగుతోందని ఆరోపణలున్నాయి.
ప్యాపిలిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. సదరు కార్యాలయంలో ఏ పని కావాలన్నా సదరు డాక్యుమెంట్ రైటర్లను కలిస్తేనే పని జరుగుతుందనే ప్రచారం లేకపోలేదు. అక్కడ ఉద్యోగుల నోటి నుంచి కూడా ఇదే పదం రావడం గమనార్హం. ఆ ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఏ రోజుకారోజు జరిగిన క్రయ విక్రయాల పరంగా వచ్చిన మొత్తాన్ని ఇంటికి వెళ్లే సమయంలో ఓ అధికారికి అందజేస్తున్నారని సమాచారం.
ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు బయటి వ్యక్తులు సభ్యులుగా ఏర్పడి రిజిస్ట్రేషన్లలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు బయటి వ్యక్తులతో పాటు ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లు క్రయ,విక్రయదారులతో ముందుగానే డబ్బు వసూలు చేసి కార్యాలయ పనివేళలు ముగియగానే పంపకా లు చేస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడిగినంత ఇవ్వకపోతే వారి డాక్యుమెంట్లు ముందుకు కదలవు. రిజిస్ట్రేషన్లు సైతం ఆలస్యంగా జరుగుతాయన్న ఆరోపణలున్నాయి.