Share News

ఉద్యోగాల పేరుతో మోసపోకండి

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:01 AM

: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మకూడదని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ యువతకు సూచించారు.

ఉద్యోగాల పేరుతో మోసపోకండి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

పీజీఆర్‌ఎస్‌కు 82 ఫిర్యాదులు

నంద్యాల టౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మకూడదని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ యువతకు సూచించారు. సోమవారం నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిఽధిలోని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆదే సమస్యలు మళ్లీ పీజీఆర్‌ఎస్‌కు రాకూడదన్నారు. మొత్తంగా 82 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో ప్రధానంగా.. ఇంటి స్థలం ఇప్పిస్తామని నరసింహులు అనే వ్యక్తి రూ.6లక్షలు తీసుకుని మోసం చేశాడని నెహ్రునగర్‌కు గ్రామానికి చెందిన భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. తప్పుడు

దస్తావేజుల సృష్టించి తనదికాని స్థలాన్ని తనదేనని చెప్పి నాగరాజు అనే వ్యక్తి రూ.10లక్షలు తీసుకుని మోసం చేశాడని యళ్లూరుకు చెందిన మహమ్మద్‌ హుసేన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇమ్మానియేలు అనే వ్యక్తి యర్రగుంట్ల గ్రామంలో అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తామనని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల పట్టణానికి చెందిన కాశమ్మ ఫిర్యాదు చేశారు. ఖాజా హుసేన్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌బాడుగకు ఇస్తే ప్రతి నెల డబ్బులు ఇస్తానని చెప్పి ట్రాక్టర్‌ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా, ట్రాక్టర్‌ ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నాడని వెలుగోడుకు చెందిన ముర్తుజావలి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 12:01 AM