గ్రేడింగ్ రద్దుకు ఒప్పుకోం..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:40 PM
వేరుశనగ గ్రేడింగ్‌కు స్వస్తి పలకాలని మార్కెట్ యార్డు అధికారులు ఎంత ప్రయత్నించినా సఫలం కావడం లేదు. గ్రేడింగ్ రద్దుకు ఒప్పుకోమని కమీషన్ ఏజెంట్లు భీష్మించారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం యధావిధిగా మహిళా కూలీలతో వ్యాపారులు గ్రేడింగ్ (పాసింగ్) కొనసాగించారు.
అడ్డం తిరిగిన హమాలీలు, కూలీలు
యధావిధిగా కొనసాగిన కొనుగోళ్లు
విఫలమైన అధికారుల ప్రయత్నాలు
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ గ్రేడింగ్‌కు స్వస్తి పలకాలని మార్కెట్ యార్డు అధికారులు ఎంత ప్రయత్నించినా సఫలం కావడం లేదు. గ్రేడింగ్ రద్దుకు ఒప్పుకోమని కమీషన్ ఏజెంట్లు భీష్మించారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం యధావిధిగా మహిళా కూలీలతో వ్యాపారులు గ్రేడింగ్ (పాసింగ్) కొనసాగించారు. రైతులకు నష్టం చేకూర్చే అనధికారిక పాసింగ్ వ్యవస్థను ఎత్తివేయాలని వ్యాపారులపై మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన ఒత్తిడి తీసుకొచ్చిన ఒక్క రోజులోనే ఆమె ప్రయాత్నాలు బెడిసి కొట్టాయి. నిన్నటి వరకు మహిళా కూలీలు ఆందోళన చేస్తే నేడు హమాలీలు కూడా మద్దతు పలికారు. తాము గ్రేడింగ్‌కు ఒప్పుకునేది లేదని కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వన్‌టౌన్ సీఐ శ్రీరాం, తాహసీల్దార్ రమేష్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు హమాలీలతో సమావేశమై పలు ధఫాలుగా చర్చించారు. అయినా తాము ఒప్పుకోలేమని ఖరాకండిగా చెప్పేశారు. వారి ఒత్తిడి తట్టుకోలేక మార్కెట్ యార్డ్ కార్యదర్శి అధికారుల ప్రయత్నాలు విఫలం కావడంతో పాత విధానం ద్వారానే ప్రస్తుతానికి పాసింగ్ ద్వారానే తూకాలు కొనసాగాయి. గురువారం మరో మారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి కల్పన తెలిపారు.
గ్రేడింగ్‌ను కొనసాగించాలి
మార్కెట్ యార్డ్‌లో గ్రేడింగ్‌ను కొనసాగించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి వీరేష్ కోరారు. మంగళవారం మహిళా కూలీలతో కలిసి ఆందోళన చేశారు. ఏళ్లుగా మహిళలు పనిచేస్తున్నారని గ్రేడింగ్ రద్దు చేస్తే ఉపాధి కోల్పోతారన్నారు. నాయకులు రమేష్, విజయ్, ఈరన్న పాల్గొన్నారు.