పాఠశాల విలీనం చేయవద్దు
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:15 PM
మండ్లెం గ్రామంలోని స్పెషల్ పాఠశాల విలీనాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు.
జాతీయ రహదారిపై మండ్లెం విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
జూపాడుబంగ్లా, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండ్లెం గ్రామంలోని స్పెషల్ పాఠశాల విలీనాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెంలోని పాఠశాలను రహదారి సమీపంలో ఉన్న మెయిన్ పాఠశాలలో విలీనం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ గురువారం జాతీయ రహదారిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఽధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాఠశాలను విలీనం చేశారని, అప్పట్లో ఆందోళనలు చేశామన్నారు. యథాస్థానంలోనే పాఠశాలను కొనసాగిస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడే ఉండాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జాతీయ రహదారిపై గంటపాటు ధర్నా చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రంగప్రవేశం సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించి ఆందోళనకారులకు సర్దిచెప్పారు.