ఉపాధిలో అక్రమాలకు పాల్పడొద్దు: డ్వామా పీడీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:04 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని డ్వామా పీడీ వెంకటరమణ ఆదేశించారు.
పెద్దకడుబూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని డ్వామా పీడీ వెంకటరమణ ఆదేశించారు. మంగళవారం పెద్దకడుబూరులోని మండల పరిషత కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో నాగరాజుస్వామి ఆధ్వర్యంలో ఏపీడీ లోకేశ్వర్ అధ్యక్షతన సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకడు బూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 1.4.2023 నుండి 31.3.2024 వరకు 717 పనులకు రూ.29.40 కోట్ల ఉపాధి, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఎస్‌ఏలకు సంబంధించిన పనులు చేపట్టారన్నారు. ఈ పనులపై సామాజిక బృందం 1.3.2025 నుంచి 17.3.2025 వరకు ఎస్‌ఆర్‌పీ విజ య్‌భాస్కర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారన్నారు. సామాజిక తనిఖీ బృందాలు గుర్తించిన అవినీతి అక్రమాలను పంచాయతీల వారిగా వెల్లడించారు. ఉపాధి పనుల్లో జరిగిన అవినీతి సొమ్ము రూ.3,17,60 7లను తక్షణమే రికవరీ చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే జరిమానా రూపంలో విధించిన రూ.93వేలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో బినా మీలు లేకుండా ఖచ్చితమైన కొలతలతో పనిచేయిస్తే మంచి వేతనం లభిస్తుందన్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ పీడీ మాదవీలత, ఏపీవోలు చంద్రశేఖర్, రామన్న, ఈసీ ఖాదర్‌బాషా, టీఏ, ఎఫ్‌ఏ, డీఆర్‌పీ, సామాజిక తనిఖీ బృందం పాల్గొన్నారు.