సీఐ సతీశ్ హత్యపై సీబీఐ విచారణ జరపాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:01 AM
టీటీడీ మాజీ ఏవీఎ్‌సవో, జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు, కులస్థులు డిమాండ్ చేశారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని బీసీ భవన్ నుంచి కేసీ కెనాల్, మెడికల్ కాలేజీ, రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కర్నూలులో కుమ్మరి కులస్థుల భారీ ర్యాలీ, ధర్నా
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ ఏవీఎ్‌సవో, జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు, కులస్థులు డిమాండ్ చేశారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులోని బీసీ భవన్ నుంచి కేసీ కెనాల్, మెడికల్ కాలేజీ, రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం సునయన ఆడిటోరియంలో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్ డాక్టర్ సిరికి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ధర్నాలో కర్నూలు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు, రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవీ సుబ్బయ్య మాట్లాడుతూ సతీష్ కుమార్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన టీటీడీ పరకామణిలో చోరీకి పాల్పడిన అనుమానితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీశ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సతీష్ కుమార్ పిల్లలకు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాకు డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, సంఘం రాష్ట్ర అద్యక్షులు మురళి మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపెంట రాంబాబు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు వై.నాగేశ్వరరావు, సోమేష్, 25 వార్డు ఓసీఎం రంగా, కే.మధు, చిన్న పుల్లయ్య, కే.లింగన్న, శ్రీనివాసులు, కేసీ నాగన్న, సుగూరు వెంకటేశ్వర్లు, కే.రమేష్, బీసీ, రజక వృత్తిదార్ల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పథకం ప్రకారమే సతీశ్ హత్య
ఫ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేటి ఈశ్వర్
పత్తికొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్‌ది పథకం ప్రకారం జరిగిన హత్యేనని శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేటి ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి పత్తికొండకు వచ్చిన ఆయన.. సతీశ్‌కుమార్ భార్య మమ తోపాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ టీటీడీ పరకామణి సంఘటనకు సంబంధించి నిజాయితీగా సతీశ్‌కుమార్ కేసు నమోదు చేశారన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు సతీశ్‌కుమార్‌పై ఒత్తిడితెచ్చి లోక్‌అదాలత్‌లో కేసు రాజీ చేయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన కేసు సీఐడీ విచారణకు రావడంతో మొదటి విడతగా సతీశ్‌కుమార్ చోరీ వివరాలను, ఒత్తిడి అంశాలను వారికి తెలియజేశారన్నారు. మరోసారి విచారణకు వెళ్తుండగా తమ పేర్లు బయటకు వస్తాయనే భయంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఓ నిజాయితీ పోలీసు అధికారిని కోల్పోయామని సతీశ్‌కుమార్ హత్యని సీరియస్‌గా తీసుకొని విచారణ చేస్తుందన్నారు. అనంతరం శాలివాహన చైర్మన్ పేరేటి ఈశ్వర్, కార్పొరేషన్ డైరెక్టర్లు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును కలిశారు. సతీశ్‌కుమార్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే అన్నారు.