Share News

సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:54 AM

జిల్లా వ్యాప్తంగా 2025 మెగా డీఎస్సీకి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు

సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి
వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

ఓర్వకల్లు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 2025 మెగా డీఎస్సీకి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న శ్రీనివాస బీ.ఎడ్‌, రాఘవేంద్ర బీ.ఎడ్‌ కళాశాలల్లో డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. డీఎస్సీ వెరిఫికేషన్‌ కేంద్రాలకు ధ్రువపత్రాల పరిశీలన కోసం హాజరయ్యే అభ్యర్థులకు ఏ చిన్న సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఇంటర్నెట్‌, విద్యుత్‌ సదుపాయాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల ధ్రువీకరణ కీలకమైనదని, క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. సబ్జెక్టు వారీగా ఏర్పాటు చేసిన గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఎంత మంది అభ్యర్థులు హాజరుకానున్నారని అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో వచ్చే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలపై కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం 54 బృందాలతో పాటు అదనంగా మరికొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్‌కు వివరించారు. వెరిఫికేషన్‌కు ఏ క్షణాన ఆదేశాలు అందినా వెంటనే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని డీఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల డీఈవోలు శామ్యూల్‌ పాల్‌, జనార్ధన్‌రెడ్డి, డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:54 AM