కృష్ణా జలాలను ఎస్కేప్ ఛానల్‌కు మళ్లించడం రాయలసీమకు అన్యాయం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:47 PM
కృష్ణా జలాలను ఎస్కేప్ ఛానల్‌కు మళ్లించడం రాయలసీమకు అన్యాయం
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు కృష్ణాజలాలు అందకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేసి నీటిని ఎస్కేప్ ఛానల్‌కు మళ్లించడం రాయలసీమకు అన్యాయమేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. గురువారం నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వం జారీచేసిన జీవోలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన 120 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి 30 రోజుల్లో అందించాలన్న లక్ష్యంతో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్సార్బీసీ రెగ్యులేటర్ ద్వారా ప్రధాన కాల్వకు కృష్ణా జలాలు వెళ్లకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేసి ఆ నీటిని ఎస్కేప్ ఛానల్‌కు మళ్లించే నిర్మాణాలను పూర్తిచేశారని, ఈ పనులకు పాలనాపరమైన అనుమతులు ఎవరు, ఎప్పుడు ఇచ్చారో తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా కృష్ణా జలాలు గోరుకల్లు రిజర్వాయర్‌కు చేరడానికి ఉన్న అడ్డంకులను తొలగించి 22వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి తక్షణమే పెంచాలని కోరారు.