ముదిరిన వివాదం
ABN , Publish Date - May 14 , 2025 | 12:23 AM
కర్నూలు మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో వివాదం ముదిరింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయ కులు క్యాంటీన్‌కు తాళాలు వేశారు
కేఎంసీ క్యాంటీన్‌కు తాళంవేసిన సంఘం నేతలు
తాళాలు పగులకొట్టిన నిర్వాహకులు
ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు
కర్నూలు హాస్పిటల్, మే 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీ క్యాంటీన్‌లో వివాదం ముదిరింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయ కులు క్యాంటీన్‌కు తాళాలు వేశారు. ఐదు గంటలు కాకముందే క్యాంటీన్‌కు వేసిన తాళాలను పగల కొట్టి క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. క్యాంటీన్ మాదేనని వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.బ్రహ్మాజీ మాస్టర్ అంటుంటే.. కాదు 30 ఏళ్లకు అగ్రిమెంటు ఉందని, క్యాంటీన్ మాదేనని డా.వరప్రసాద్ అంటున్నారు. మరో పక్క వైద్యుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డా.బ్రహ్మాజీ మాస్టర్, డా.రామశివ నాయక్, కోశాధికారి డా.డమం శ్రీనివాసులు, ఈసీ సభ్యులు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.సాయిసుధీ ర్‌కు క్యాంటీన్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. డా.వరప్రసాద్ పేరుతో క్యాంటీన్‌ను నడుపుతున్న అనధికార వ్యక్తులకు పదేపదే నోటీసులు ఇచ్చామన్నారు. సోమవా రం ఉదయం క్యాంటీన్‌కు తాము తాళంవేస్తే.. సాయంత్రం క్యాంటీన్ తాళం పగులకొట్టి అక్రమంగా ప్రవేశించారని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు వివరించారు. దీనిపై క్యాంటీన్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని గొడవలు జరగకుండా పోలీసులు సహకారం ఉండాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాళం పగులగొట్టడం నేరమని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు వివరించారు. దీనిపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.సాయిసుధీర్ మాట్లాడుతూ సంఘం నేతల ఫిర్యాదును ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకు వెళ్లానని క్యాంటీన్ వ్యవహారంలో గొడవలు జరగకుండా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నెలకొల్పాలని త్రీటౌన్ సీఐకి లేఖలు రాసినట్లు తెలిపారు.