Share News

రైతుకు విపత్తి

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:16 PM

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈ ఏడాది వరుణుడు కరుణించాడని రైతన్నలు సంబరపడి పోయారు.

రైతుకు విపత్తి

తెగులుతో దిగులు

ఎర్రబారుతున్న పొలాలు

పూత, కాయలు రాలుతున్నాయ్‌

పిచికారి చేసినా ఫలితం ఇవ్వని మందులు

దిగుబడిపై ప్రభావం

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈ ఏడాది వరుణుడు కరుణించాడని రైతన్నలు సంబరపడి పోయారు. ఈ ఆనందం వారికి ఎక్కువ కాలం నిల్వలేదు. ఖరీఫ్‌లో సాగుకు సిద్ధమై పత్తి పంటను పండించారు. పంటలు పచ్చగా ఉన్నాయన్న తరుణంలో ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. పత్తి మొక్కను తెగుళ్లు, పురుగులు, తెల్ల, పచ్చ దోమ వెంటాడుతుండగా.. పత్తి పూత, కాయలు ఎర్రిబారి రాలిపోతున్నాయి. వాటిని నివారించేందుకు పిచికారి మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. ఇప్పటికే వేలకు వేలు పెట్టుబడులతో అదనపు భారం పడుతోంది. ఈ తెగులు మరింత తీవ్రమైతే పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉండటంతో అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు.

ఆదోని అగ్రికల్చర్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తిపంట సాగు చేసే జిల్లా కర్నూలు. ఈ ఏడాది ఇప్పటివరకు 2,21,356 లక్షల హెక్టార్లలో పత్తి సాగైందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే మార్కెట్లో అధికంగా ధర పలుకుతుండడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కూడా భారీగా పెంచడంతో అన్నదాతలు పత్తి సాగు వైపే అధికంగా మొగ్గు చూపారు. ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా పత్తి పంటను సాగు చేశారు. పంట అంతా పచ్చగా పెరుగుతున్న తరుణంలో జూలై, ఆగస్టు నెలలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురిశాయి. మరింత ఏపుగా మొక్క పెరగడానికి రైతులు యూరియా, రసాయనిక మందులు అధికంగా వాడారు. కొద్ది రోజులకు పంట అంతా ఎర్రబారిపోయింది. పూత దశలో ఉన్న మొగ్గ పిందెలోనే రాలిపోయాయి. పత్తికాయలు రాలి పురుగులు సోకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల కోడుమూరు, ఆలూరు, కోసిగి కౌతాళం, పెద్దకడబూరు మండలాలలో పత్తి చేలంతా ఎర్రబారిపోయాయి. రైతులు ఎర్రబారకుండా వేలకు వేలు పెట్టుబడి పెట్టి పిచికారు మందులు వాడినా ఫలితం లేదని దిగాలు చెందుతున్నారు.

విచ్చలవిడిగా ఎరువులు..

వర్షాలకు విచ్చలవిడిగా ఎరువులు వాడటంతో పత్తిలో దోమపోటు విపరీతంగా పెరిగింది. దోమపోటుకు మొక్క సారాన్ని పీల్చి పంట దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు.

మూడేళ్లకు ఒక్కసారి పంట మార్పిడి

కర్నూలు జిల్లాలో పత్తి పంటను రైతులు పదేళ్లుగా సాగు చేస్తున్నారు. మూడేళ్లకు ఒకసారి పంట మార్పిడి చేయాల్సి ఉన్నా రైతులు అధిక ధరలతో పత్తి పంటనే వరుసగా సాగుచేస్తున్నారు. దీంతో భూమిలో సారం తగ్గి దిగుబడి మరింత తగ్గడమే కాకుండా తెగుళ్లు, పురుగులు అధికంగా సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులకు అవగాహన కల్పిస్తున్న పట్టించుకోవడం లేదు.

అధిక వర్షాలతో మొక్క దెబ్బతిని..

వర్షాధారం కింద ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. అధికార వర్షాల వల్ల మొక్కలు దెబ్బతిన్నాయి. పూత కాయలు రాలిపోయాయి. పత్తి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దిగుబడి తగ్గితే పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు చెబుతున్నారు.

నాలుగెకరాల్లో పత్తి సాగు చేశా

నాకున్న నాలుగెకరాల్లో పత్తి పంటను సాగు చేశా. ఎకరాకు ఇప్పటికే 25 వేలకుపైగా పెట్టుబడి పెట్టాను. వర్షాలత్లో పురుగు తీవ్రత పెరిగింది. వారానికి ఒకసారి పిచికారి మందు చేస్తున్నాను. పురుగు, దోమపోటు తగ్గడం లేదు.

రాజు, కల్లుబావి, ఆదోని మండలం

దిగుబడి తగ్గే ప్రమాదం

నాకున్న 10 ఎకరాల్లో నాలుగేళ్లుగా పత్తి సాగు చేశా. ఆగస్టు నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చేలంతా ఎర్ర బారింది. పూత పిందెలంతా రాలిపోయాయి. మందులు చలినా పిచికారి చేసినా పంట నష్టం జరుగుతూనే ఉంది. దిగుబడులు తగ్గే ప్రమాదముంది.

రవి, రైతు, ఆదోని మండలం

యాజమాన్య పద్ధతులు పాటించాలి

ఆగస్టు మూడో వారంలో కురిసిన వర్షాలకు పత్తి పంటలో ఎదుగుదల లోపించింది. పోషకా లను మొక్కలు గ్రహించు కోలేకపోవడం, నేలల్లో తేమశాతం లేకపోవడంతో ఆకులు ఎరుపు లేదా పసుపు రంగులోకి మారాయి. అక్కడక్కడ పూత, పిందెలు రాలడం గమనిస్తున్నాం. రైతులు వ్యవసాయ అఽధికారులు చెప్పిన విధంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఫలితం ఉంటుంది.

సుధాకర్‌, వ్యవసాయ శాఖాధికారి, ఆదోని

Updated Date - Sep 10 , 2025 | 11:16 PM