పత్తికి విపత్తు..!
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:14 PM
పత్తికి విపత్తు..!
అధిక వర్షాలతో పంటను పీడిస్తున్న తెగుళ్లు
కుళ్లిపోతున్న కాయలు
వానలకు నేలపాలవుతున్న తెల్లబంగారం
ఎకరాకు రెండు మూడు క్వింటాళ్లు నష్టం
ఎన్నో ఆశలతో సాగు చేసిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు నిండా ముంచేశాయి. అధిక తేమకు విజృంభిస్తున్న తెగుళ్లతో కష్టజీవులకు కష్టాలు.. నష్టాలు పెరుగుతున్నాయి. చెట్టుపైనే కాయలు కుళ్లిపోతున్నాయి. తీసేందుకు సిద్ధంగా ఉన్న తెల్లబంగారం నేలపాలవుతోంది. విత్తనాలు మొలకెత్తడం.. పత్తి రంగు మారడంతో రైతులు కదేలవుతున్నారు. ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల దిగుబడి కోల్పోతున్నామని అన్నదాతలు ఏకరువు పెడుతున్నారు. ధరలు పతనమై ఉల్లి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తాజాగా ఆ జాబితాలో పత్తి రైతులు చేరుతున్నారు. జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలు కారణంగా దాదాపుగా 16 లక్షల క్వింటాళ్లు పత్తి దిగుబడులు నష్టపోతున్నామని కన్నీళ్లు పెడుతున్న పత్తి రైతుల ఆవేదనపై ఆంరఽధజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి సాగులో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 4.02 లక్షల హెక్టార్ల (10.05 లక్షల ఎకరాలు)లో పత్తి సాగు చేశారని ప్రభుత్వ అంచనా. అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 2.17 లక్షలు హెక్టార్లు (5.43 లక్షల ఎకరాలు)లో పత్తి సాగు చేశారు. ఎకరానికి సగటున రూ.45-50 వేలు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. ఈ లెక్కన రూ.2,500 కోట్లకు పైగా పత్తి సాగు కోసం సేద్యం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపులు.. ఇలా వివిధ రూపాల్లో మట్టిలో పోశారని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు వివరించారు. జూన్, జూలై నెలల్లో పత్తి విత్తనాలు నాటారు. మొలకెత్తి పత్తి పచ్చగా ఏపుగా పెరుగుతుంటే కష్టాలు తీరుతాయని సంబర పడ్డారు. చెట్టుకు 15-20 కాయలు కాసి, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు నిలువున ముంచెత్తాయి. రైతులకు ఉహించని నష్టం మిగిల్చింది. పైన పచ్చగా కనిపించే పత్తి పంట దిగువన కుళ్లిన కాయలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
రూ.1.250 కోట్ల విలువైన దిగుబడులు నష్టం
జిల్లాలో గత నెలలో కురిసిన అధిక వర్షాలకు మొగ్గలు, పూత రాలిపోవడమే కాకుండా అధిక తేమకు కాయలు నల్లబారి కుళ్లిపోయాయి. తాజాగా వర్షాలకు మరింత నష్టం చేకూరింది. కాయలు కుళ్లిపోవడమే కాకుండా, అరకొర ఎండలకు కాయలు పగిలి పత్తిని రేపోమాపో తీద్దామని అనుకుంటే జిల్లాలో కురిసిన వర్షాకుల నేల రాలిపోతోంది. తెల్లబంగారం రంగు మారి చెట్టుపైనే పత్తిలో విత్తనాలు మొలకలు వస్తున్నాయి.ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు దిగుబడి నష్టపోతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు జిల్లాలో 5,43,575 ఎకరాల (2,17,430 హెక్టార్లు)లో పత్తి సాగు చేశారు. రైతులు చెబుతున్నట్లు ఎకరాకు సగటున 3 క్వింటాళ్లు దిగుబడి కోల్పోయినా 16.30 లక్షల క్వింటాళ్లు (1.63 లక్షల టన్నులు) నష్టపోవాల్సి వస్తోంది. మద్దతు ధర రూ.8,110 ప్రకారం దాదాపుగా రూ.1,250 కోట్లు విలువైన పత్తి దిగుబడులు మట్టిపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజృంభిస్తున్న తెగుళ్లు
అధిక వర్షాలు.. అధిక తేమకు పత్తి పంటపై తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం కాయకుళ్లు తెగులు రైతును కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. చెట్టుకు 15-20 కాయలు ఉంటే సగానికి పైగా కాయలు కుళ్లిపోయాయి. పగిలిన పత్తి కూడా తేమకు విత్తనాలు మొలకలు రావడమే కాకుండా తెల్లని పత్తి రంగుమారుతుంది. నంద్యాలకు చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రం (ఆర్‌ఏఆర్‌ఎస్), ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ చైతన్య, డాక్టర్ రాఘవేంద్ర చౌదరి, డాక్టర్ రాఘవేంద్రలు ఆదోని మండలంలోని మదిరె, పర్వతాపురం, ఆలూరు మండలం హుళేబీడు, హాలహర్వి మండలం బాపురం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి పొలాలను పరిశీలించారు. కాయ కుళ్లు తెగులు తీవ్రంగా ఉందని, చెట్టుపై కాయలు కుళ్లిపోయి పత్తి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
చెట్టుపైనే మొలకలు వచ్చాయి
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ.50 వేలు చొప్పున రూ.2.50 లక్షలు అప్పు చేశా. ఎకరాకు కనీసం 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించా. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు కాయ కుళ్లు తెగులు వ్యాపించి చెట్టుపైనే కుళ్లిపోయింది. పగిలిన పత్తి తీసేందుకు అకాశం లేక విత్తనాలు మొలకలు వస్తున్నాయి. అరకొర పత్తి నేలరాలిపోతోంది. ఎకరాకు నాలుగు క్వింటాళ్లు చొప్పున 20 క్వింటాళ్ల దిగుబడి కోల్పోవాల్సి వచ్చింది. మద్దతు ధర రూ.8,110 ప్రకారం రూ.1.62 లక్షలు నష్టపోక తప్పడం లేదు.
- హెచ్.ఈరప్ప, నెట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం