Share News

ప్రత్యక్ష అమ్మకాలకు తూట్లు

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:08 AM

కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి చెందిన రామాంజినేయులు ఇటీవల ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని కమీషన్‌ ఏజెంట్‌ దుకాణానికి 12 క్వింటాళ్ల పత్తిని ఉంచారు.

ప్రత్యక్ష అమ్మకాలకు తూట్లు
వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి వచ్చిన పత్తి దిగుబడులు

దళారీ వ్యవస్థతో రైతులు దగా

జిల్లా మార్కెట్‌ కమిటీల్లో అమలు కాని విధానం

రైతులకు అవగాహన కల్పించని మార్కెటింగ్‌ శాఖ

కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి చెందిన రామాంజినేయులు ఇటీవల ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని కమీషన్‌ ఏజెంట్‌ దుకాణానికి 12 క్వింటాళ్ల పత్తిని ఉంచారు. టెండర్‌ ద్వారా క్వింటాలు రూ. 7000 పలకగా రూ. 84,000 రావాల్సి ఉంది. ఇందులో రైతు తెచ్చిన పత్తిని అమ్మించినందుకు కమీషన్‌ ఏజెంట్‌ 2 శాతం కమీషన్‌ రూ.1,680, అదే రోజు అప్పటికప్పుడు నగదు చెల్లించాలంటే నూటికి రూ.2 లెక్క ప్రకారం రూ. 1,680 పట్టుకున్నారు. దీంతో పాటు హమాలీ కూలి డబ్బులు, తూకపు చార్జీలు, మహిళ కూలీ చార్జీలంటూ లెక్కించి రైతుకు రూ. 79,000 చేతిలో పెట్టారు. అంతేకాదు తాను పెట్టుబడి ఖర్చులకోసం ముందుగానే అప్పుగా రూ. 50వేలు దుకాణదారుడు దగ్గర తీసుకున్నారు. ఇలా అన్నీ పరిశీలిస్తే మార్కెట్‌ యార్డ్‌లో జరుగుతున్న లావాదేవీల కమీషన్‌ రూపేణా రూ. 10 లక్షలు కత్తిరింపు రూపంలో రైతులు దగాకు గురవుతున్నారు.

ఆదోని అగ్రికల్చర్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఈ ఒక్కరైతే కాదు జిల్లాలో వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం నేరుగా వారి ప్రమేయం లేకుండా ఆర్థిక భారాన్ని తగ్గిం చేందుకు వ్యాపారికే రైతు పండించిన పంటను నేరుగా అమ్ముకునేందుకు డైరెక్ట్‌ సేల్‌ ప్రత్యక్ష అమ్మ కాన్ని తీసుకొని వచ్చింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్కెట్‌ యార్డులలో ఇది అమలు కావడం లేదు. ప్రత్యక్ష అమ్మకాలను ప్రోత్సహిం చాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేశారు. రైతులు అవగాహన లేక తీవ్రంగా నష్టపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ప్రధానమైన మార్కెట్‌ యార్డులు ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, నిత్యం ప్రతిరోజు పత్తి, వేరుశనగ, ఆముదం, కందులు, ఉల్లి, ఎండుమిర్చి వాము, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు క్రయవిక్రయాలు జరుగుతాయి. జిల్లా రైతులే కాకుండా పక్క జిల్లా అనంతపురం, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా తాము పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వేలమంది రైతులు వస్తుంటారు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఏటా ప్రత్యక్షంగా రూ. 1600 కోట్లు, కర్నూలు రూ. 600 కోట్లు ఎమ్మిగనూరు రూ. 500 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో ఒక శాతం సెస్సు రూపంలో మార్కెట్‌ కమిటీకి ఆదాయం సమకూరుతుంది.

ప్రత్యక్ష అమ్మకాలపై అవగాహన ఏదీ?

ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు మార్కెట్‌ యార్డులో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మార్కెట్‌ యార్డ్‌లో ఉన్న దళారి వ్యాపారుల దగ్గరకు (కమీషన్‌ ఏజెంట్లు) వద్దకు వెళ్లకుండా నేరుగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను వ్యాపారికే అమ్ముకునే వెసులుబాటును కల్పించింది. అదే ప్రత్యక్ష అమ్మకాలు (డైరెక్ట్‌ సేల్‌). ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ రైతులకు అధికారులు అవగాహన కల్పించకపోవడంతో అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్కెట్‌ కమిటీల్లో కేవలం ప్రత్యక్ష అమ్మకాలు వేదిక అంటూ బోర్డులకే పరిమితం చేశారు. గత నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం డైరెక్ట్‌ సేల్‌ను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించింది. అప్పుడు హడావిడి చేసి కొంతమంది రైతులు ముందుకు రాక అటు వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపక ఈ విధానం అటకెక్కింది. దీంతో రైతులు దళారి కమీషన్‌ రూపంలో ఏటా రూ. లక్షల్లో నష్టపోతున్నారు. మరోవైపు రైతులు పంటల సాగుకు పెట్టుబడి ఖర్చుల కోసం (ఎరువులు, విత్తనాలు, పిచికారీ, మందులు, పొలం పనుల కూలీల కోసం) కమీషన్‌ ఏజెంట్ల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. దీనివల్ల రైతులు ఎక్కడ అప్పులు వారు ఇవ్వరోనని భయంతో వ్యాపారికి నేరుగా అమ్ముకునేందుకు(ప్రత్యక్ష అమ్మకాలు) ముందుకు వచ్చేందుకు జంకుతున్నారు.

జరుగుతున్నది ఇలా..

రైతు తాము పండించిన పంట అమ్మకం కోసం మార్కెట్‌ యార్డులో కమీషన్‌ ఏజెంట్ల దుకాణాల ముందు ఉంచుతారు. కమీషన్‌ ఏజెంట్‌ దుకాణం పేరు మీద వ్యాపారులు టెండర్‌ ధర నమోదు చేస్తారు. ఎవరు అధిక ధర నమోదు చేస్తే వారికి కేటాయిస్తారు. రైతు అమ్మకానికి తెచ్చిన దిగుబడి అమ్మి ఇచ్చినందుకు కమీషన్‌ ఏజెంట్‌ రైతు దగ్గర రెండు శాతం కమీషన్‌ వసూలు చేస్తారు. అప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలంటే రూ. 100కు 2 శాతం కమీషన్‌ వసూలు చేస్తారు. దీంతోపాటు హమాలీ చార్జీలు, తూకపు చార్జీలు, ముందుగా సాగు పెట్టుబడి ఖర్చుల కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ, ఇతరత్రా చార్జీలు మరో రెండు శాతం వరకు రైతుల నుంచి కత్తిరింపులు జరుగుతున్నాయి. ఇలాగా రైతులు దగాకు గురవుతున్నారు.

వ్యాపారులు ముందుకు రావడం లేదు

మార్కెట్‌ యార్డులో ప్రత్యక్ష అమ్మకాలను జరిపేందుకు ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేశాం. రైతులు నుంచి ప్రత్యక్ష అమ్మకాల ద్వారా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ప్రధానంగా రైతులకు కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. రైతులు కమీషన్‌ ఏజెంట్‌ ద్వారా పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు తీసుకోవడం వల్ల నేరుగా వ్యాపారికే విక్రయించుకుంటున్నారు. రైతులకు యార్డ్‌లో మైకుల ద్వారా ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధానం వల్ల రైతులు కమీషన్‌ లేకుండా నేరుగా అమ్ముకొని ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

గోవిందు, మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి, ఆదోని

Updated Date - Dec 08 , 2025 | 12:08 AM