అప్పుల కోసం తిప్పలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:14 AM
ఈ రైతు పేరు మల్లన్న. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి గ్రామం. ఈ ఖరీఫ్‌లో తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేసేందుకు పెట్టుబడి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు
పంట రుణాల కోసం పరపతి సంఘాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
ఖరీఫ్‌లో రూ.500 కోట్ల రుణాలు ఇవ్వాలని డీసీసీబీ లక్ష్యం
19 సంఘాలకు మాత్రమే రుణాలిచ్చే అర్హత
80 సంఘాలకు అర్హత లేదంటున్న అధికారులు
రికవరీ కోసం సీఈవోలను పరుగులు పెట్టిస్తున్న అధికారులు
కర్నూలు అగ్రికల్చర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఈ రైతు పేరు మల్లన్న. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి గ్రామం. ఈ ఖరీఫ్‌లో తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేసేందుకు పెట్టుబడి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘం చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. గతంలో ఈ క్రిష్ణగిరి సంఘంలో తీసుకున్న రుణాలు సక్రమంగా వసూలు కాలేదని సహకార బ్యాంకు తేల్చింది. బకాయిలను రికవరీ చేస్తేనే తిరిగి రుణాలు ఇచ్చేందుకు నిధులను కేటాయిస్తామని చెప్పింది. దీంతో సంఘం సీఈవో, సిబ్బంది బకాయిలు రాబట్టేందుకు గ్రామాల వెంట పరుగులు పెడుతున్నారు. బకాయిల రికవరీ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు తమకు రుణం మంజూరు చేస్తారు? అని ఈ రైతు ఎదురు చూస్తూన్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మూడు లక్షల మంది రైతులు ఖరీఫ్ సాగు కోసం పడిగాపులు కాస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ రుణ పంపిణీ లక్ష్యం రూ.500 కోట్లు
ఈ సంవత్సరం రైతులకు పంట సాగు కోసం సహకార సంఘాల ద్వారా రూ.500 కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం రైతులకు ఇచ్చిన రుణ బకాయిలను సకాలంలో చెల్లించిన రైతులకే మొదట ప్రాధాన్యత జాబితాలో చేర్చి ఆ సంఘా లకు నిధులు కేటాయించాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 60 శాతం రుణ బకాయిలు చెల్లించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు మాత్రమే రుణాలు పంపిణీ చేసేందుకు నిధులను కేటాయించే అవకాశం ఉందని అధికా రులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 19 సంఘాలు మాత్రమే రుణబకాయిలు సక్రమంగా చెల్లించిన అర్హత లభించింది. ఇంకా 80 సంఘాలు 60శాతం రుణ బకాయిలను సాధించలేక వెనుకబడి పోయాయి. ఈ సంఘాలకు నిధులు విడుదల చేయా లంటే లక్ష్యం మేరకు బకాయిలు వసూలు చేయాల్సిందేనని, వెంటనే గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించి బకాయిలు వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో సహకార సంఘాల సీఈవోలు సిబ్బంది గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. అయితే రైతులు బకాయిలను చెల్లించే పరిస్థితిలో లేరని, వారే రుణాల కోసం ఎదురు చూస్తున్నారని, తాము ఎంత బతిమిలాడినా, ఒత్తిడి తెచ్చినా రైతులు బకాయిలు చెల్లించేందుకు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నా రని సంఘాల అధికారులు వాపోతున్నారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన ఒక రైతు రుణ బకాయిలను వెంటనే చెల్లించా లని ఒత్తిడి తెస్తే తన వల్ల కాదని, తనకే పంట సాగు కోసం రుణం ఇవ్వాలని అర్థించడంతో సహకార సంఘం అధికారులు మరో దారిలేక వెనుదిరిగి వచ్చారని సమాచారం.
రుణం ఇచ్చే సమయంలో రికవరీలా...! రైతుల ఆవేదన
ఉమ్మడి జిల్లాలోని 99 సహకార సంఘాల ద్వారా ఏటా ఖరీప్, రబీ సీజన్లలో నాలుగున్నర లక్షల మంది రైతులు సాగు రుణాలు తీసుకుంటున్నారు. ఇతర వాణిజ్య బ్యాంకులతో పోటీ పడి సహకార కేంద్ర బ్యాంకు రైతులకు రుణాలు అందిస్తుండటంతో రైతులంతా సహకార సంఘాల ద్వారానే రుణాలు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. మామూలుగా పంట కాలం ముగిసిన తర్వాత పంట ఉత్పత్తులను అమ్మిన సమయంలో సహకార సంఘాల అధికారులు, సిబ్బంది రైతుల నుంచి రుణ బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి పంట అమ్ముకున్న రైతులు వివిధ కారణాల వల్ల బకాయిలు చెల్లించలేక పోయారు. దీంతో రికవరీ 80 సంఘాలకు లేకుండా పోయింది. కేవలం 19 సహకార సంఘాలు మాత్రమే 60 శాతానికి మించి బకాయిలను రాబట్టగలిగాయి. సాగు కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోం దని, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ప్రాథమిక వ్యవసాయ సంఘాల నుంచి ప్రస్తుతం రుణాలు అందుతాయో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ శాతాన్ని 60 నుంచి కొంత సడలింపు ఇస్తే చాలా సంఘాలకు రైతులకు రుణాలు ఇచ్చే అర్హత సాధించే అవకాశం ఉందని సీఈవోలు అంటున్నారు.
19 సంఘాలకే రుణాలు ఇచ్చేందుకు అర్హత
వర్షాభావం, గిట్టుబాటు ధర అందని కారణంగా ఉమ్మడి జిల్లాలోని రైతులు చాలామంది రుణ బకాయిలు చెల్లించ లేకపో తున్నారు. దీంతో రైతులకు రుణాలు ఇచ్చిన ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. కేవలం 19 సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చే అర్హత ఉన్నట్లు గుర్తించాం. మిగిలిన 80 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు త్వరితగతిన రుణ బకాయిలు వసూలు చేయగలిగితే రైతులందరికీ పంట రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. - వెంకటకృష్ణ, డీసీవో.