విచారణ సజావుగా సాగేనా?
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:35 PM
పురపాలక సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణ సక్రమంగా జరిగేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పుర పాలకంలో అక్రమాలపై పలు ఆరోపణలు
విచారణ అధికారిగా ప్రదీప్ కుమార్
నంద్యాల మున్సిపాలిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణ సక్రమంగా జరిగేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రఽధాన ఆదాయ వనరుల్లో పట్టణ ప్రణాళిక విభాగం ఒకటి. పట్టణంలో ఓపెన్ స్పేస్ ఆదాయానికి గండి కొట్టడం, పలు అనధికారిక నిర్మాణాలకు అనుమతులు వంటి ఆరోపణలపై అప్పటి కమిషనర్ పుల్లారెడ్డితో పాటు మరో 15 మందిని విచారించేందుకు కర్నూలు సిటీ ప్లానర్ పి. ప్రదీప్ కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు.
భ్రష్టు పట్టిన పట్టణ ప్రణాళిక వ్యవస్థ
అవినీతి పునాదుల మీద రాజకీయ సౌధాలను నిర్మించుకున్న రాజకీయ అక్రమార్కులు, దళారులు, అధికారులు పట్టణ ప్రణాళిక వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. నగరంలో ఖరీదైన ప్రాంతాలైన పద్మావతి నగర్, సంజీవనగర్, ఎన్జీఓస్ కాలనీ, ఎస్‌బీఐ కాలనీతోపాటు పాత పట్టణంలోని పలు వార్డుల్లో సైతం రాజకీయ అక్రమా ర్కులు, అధికారులు, దళారులు కుమ్మక్కై పట్టణ ప్రణాళికను నిర్వీర్యం చేయటంతో పాటు మున్సిపల్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొడుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మున్సిపల్ కమిషర్ సీహెచ్ పుల్లా రెడ్డితోపాటు, వీఎస్‌ఎం నరసింహ మూర్తి, (ఏసీపీ), జి. రామకృష్ణుడు (మాజీ ఏసీపీ), మాజీ టీపీఓ ఎస్. రంగస్వామి, మాజీ టీపీఎస్ డి.రాణెమ్మ, శివుడు నాయక్, టీపీఎస్, మాజీ టీపీఎస్ ఎ. బాల మద్దయ్య, మాజీ టీపీబీవో ఎస్. రిజ్వాణా, డబ్ల్యూపీఆర్‌ఎస్‌లు వి. సిద్ధార్ధ, ఎ. శేఖర్, ఎస్.సాయిరంగ మనోజ్, జి.భరత్‌కుమార్, పి.రామలక్ష్మి, వి. కణ్యాణి, బి. సంధ్యారాణి, కె.మధుసూదన్ రెడ్డి ఉన్నారు. కాగా అవినీతి తిమింగలాల అంతు తేల్చే క్రమంలో కర్నూలు సిటీ ప్లానర్ పి. ప్రదీప్ కుమార్ నిజాయితీ వైపు మొగ్గుతారా.. ఒత్తిడికి తలొగ్గుతారో చూడాలి.