మధుమేహం.. అప్రమత్తం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:30 AM
‘మా ఇంట్లో ఎవ్వరికీ షుగర్ వ్యాధి లేదు.. మేము కష్టపడే వాళ్లం.. మాలాంటి వాళ్లకు రాదు..’ అనే మాటలు చెల్లవిక. ఇప్పుడు మధుమేహం సర్వసాధారణ వ్యాధి. ఎవరికైనా వస్తుంది. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు
జిల్లాలో పెరుగుతున్న షుగర్ బాధితులు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు
నేడు ప్రపంచ మధుమేహ నివారణ దినం
కర్నూలు హాస్పిటల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘మా ఇంట్లో ఎవ్వరికీ షుగర్ వ్యాధి లేదు.. మేము కష్టపడే వాళ్లం.. మాలాంటి వాళ్లకు రాదు..’ అనే మాటలు చెల్లవిక. ఇప్పుడు మధుమేహం సర్వసాధారణ వ్యాధి. ఎవరికైనా వస్తుంది. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మార్పుల వల్ల మధుమేహం బారిన పడుతున్నారు. నవంబరు 14 వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ ఈ ఏడాది మధుమేహం-శ్రేయస్సు అనే నినాదాన్ని ఇచ్చింది.
మధుమేహం ప్రమాదకరమైన వ్యాధి. అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుందని అంటారు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి.
టైప్-01: ఆటోఇమ్యూన్ కారణంగా ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది.
టైప్-02: ఇన్సులిన్ నిరోధకత, జీవనశైలి కారణంగా గర్భధారణ మధుమేహం, గర్భధారణ సమయంలో వస్తుంది.
ఇతర రకాలు: జన్యు లేదా మందుల కారణంగా, ఊబకాయం వల్ల, వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్, ఒత్తిడి, పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల షుగర్ వస్తుంది.
పట్టణాల్లో ఎక్కువ..
జిల్లాలో షుగర్ వ్యాధి బాధితులు పట్టణాల్లో అధికంగా ఉన్నారు. పట్టణాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 15 మంది బాధితులు నమోదవుతున్నారు. అసలు ఈ సమస్య ఉన్నట్లు తెలియని వారే ఎక్కువ మంది. ఏదైనా అనారోగ్య సమస్యతో వచ్చినప్పుడు, ఆపరేషన్ చేసే సమయంలో రక్తపరీక్షలు చేస్తున్నప్పుడు మధుమేహం ఉన్నట్లు బయటపడుతుంది. జిల్లాలో పీడియాట్రిక్‌తో బాధపడుతున్న వారు మరో 10 శాతం మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 19.54 లక్షల జనాభా ఉండగా.. గత సెప్టెంబరులో ఎన్‌సీడీ 4.0 పరీక్షలు నిర్వహించగా.. 149 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు.
ఈ వయసులో అధికం..
30-45 ఏళ్ల వయస్సులో ఉన్న వారిలో మధుమేహం ఇటీవల కాలంలో అధికంగా నమోదవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం మన జనాభాలో ముఖ్యంగా యువతలో గతం కంటే ఇప్పుడు పది శాతం మధుమేహం పెరుగుదల కనిపిస్తుంది. పిల్లల్లో సైతం పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.
కర్నూలు జీజీహెచ్‌కు క్యూ..
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో షుగర్ బాధితుల కోసం ప్రత్యేక ఎండోక్రైనాలజీ విభాగం ఉంది. ఈ విభాగానికి ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీగా డా.పి. శ్రీనివాసులు, అసోసియేట్ ప్రొపెసర్ డా.పి. రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డా. సయ్యద్ హలీమ్‌తో పాటు రెండు డీఎం, పీజీ సీట్లు ఉన్నాయి. వారంలో ఓపీ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉంటుంది. ప్రతి ఓపీకి 250 నుంచి 300 మంది రోగులు వస్తుంటారు.
లక్షణాలు
తరచుగా మూత్రం పోవడం
అధిక దాహం.. అధిక ఆకలి
మందగించడం
బరువు తగ్గడం, గాయాలు మానకపోవడం
తినకముందు 100 లోపు:
ఫ మన దేశంలో చక్కెరస్థాయి పరగడుపున తినక ముందు 100లోపు ఉంటే మధుమేహం లేనట్లు భావించాలి.
తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయి 200 దాటితే షుగర్ ఉన్నట్లు నిర్ధారించవచ్చు.
తెల్ల అన్నం మహా ప్రమాదం
వరి అన్నం తింటే చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. చిరుధాన్యాలు, కొర్రలు, దంపుడు బియ్యం, జొన్నరొట్టె తినాలి. ఆపిల్, బొప్పాయి, దానిమ్మ, చీనిపండ్లు తినవచ్చు. వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. లేదా నడవాలి. ఆస్టియో బ్లాస్ట్ కణాలు సరిగ్గా పని చేయక, ఎముకలు బలహీన పడతాయి. కర్నూలు జీజీహెచ్‌లో డెక్సాస్కాన్ ద్వారా ఎముకల సాంద్రతను తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. - డా.పి. శ్రీనివాసులు, ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ విభాగం, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి:
ప్రమాదాన్ని గుర్తించడం లేదు
షుగర్ వ్యాధిగ్రస్తులు పరిస్థితి విషమించే వరకు గుర్తించలేకపోతు న్నారు. ఇటీవల 14 సంవత్సరాల పిల్లలు ఊబకాయం వల్ల షుగర్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. పిల్లల్లో వ్యాయామం తగ్గడం, టీవీ, సెల్ ఫోన్‌ల ప్రభావంతో వ్యాధికి గురవుతున్నారు. - డా.పి. రాధారాణి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎండోక్రైనాలజీ విభాగం, కర్నూలు జీజీహెచ్
కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి
మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా పనివేళల్లో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొత్తగా వచ్చి టెక్నాలజీని ఉపయోగించుకుని షుగర్ వ్యాధి స్థాయిని తెలుసుకుని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. పని ఒత్తిడిలో ఉండే వారు కొత్తగా చేతికి కట్టుకునే వాచ్‌లో మన ఆరోగ్యం హెల్త్ కండీషన్ వివరాలు తెలుసుకుని పని టైంలో కూడా జాగ్రత్త పడాలి. - డా.బి. భరత్, ఎండోక్రైనాలజిస్టు, భరత్ హాస్పిటల్, కర్నూలు
=