శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:57 PM
కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు.
స్వామివారి స్పర్శ దర్శనం కోసం బారులు
శ్రీశైలం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. పౌర్ణమి ఘడియలు సమీపించడంతో ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి స్పర్శ దర్శనం కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్న భక్తులతోపాటు ఆన్‌లైన్ బుకింగ్, వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులు క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్ల ద్వారా గర్భాలయ స్పర్శదర్శనం చేసుకునేందుకు నాలుగు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం దేవస్థానం సర్వర్ గంటకుపైగా నిలిచిపోయింది. టికెట్ స్కానింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. నిర్ణీత టైం స్లాట్‌లలో జరగవలసిన ఆర్జిత శ్రీచక్ర కుంకుమార్చనలు, వృద్ద మల్లికార్జునస్వామివారికి అభిషేకాలకు భక్తులు సకాలంలో అం దుకోలేకపోవడం వల్ల ఆయా సేవల్లో పాల్గొనే అవకాశం లేకుండాపోయిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.