Share News

చదువుతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:48 PM

ఏ గ్రామం అయినా అభివృద్ధి చెందాలంటే అది చదువుతోనే సాధ్యమని ఈగల్‌ ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. శనివారం ఆయన కప్పట్రాళ్ల గ్రామానికి వచ్చారు. ముందుగా తానా భవనం నుంచి కల్యాణ మండపం చేరుకొని సమావేశంలో మాట్లాడారు

చదువుతోనే అభివృద్ధి సాధ్యం
డీఎస్సీ అభ్యర్థులను సన్మానిస్తున్న ఈగల్‌ ఐజీ ఆకె రవికృష్ణ

ప్రణాళికతో చదివి విజయం సాధించాలి

పిల్లల చదువును మధ్యలో ఆపరాదు

ఈగల్‌ ఐజీ ఆకె రవికృష్ణ

డీఎస్సీ అభ్యర్థులకు ఘన సన్మానం

దేవనకొండ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఏ గ్రామం అయినా అభివృద్ధి చెందాలంటే అది చదువుతోనే సాధ్యమని ఈగల్‌ ఐజీ ఆకె రవికృష్ణ అన్నారు. శనివారం ఆయన కప్పట్రాళ్ల గ్రామానికి వచ్చారు. ముందుగా తానా భవనం నుంచి కల్యాణ మండపం చేరుకొని సమావేశంలో మాట్లాడారు. 2006లో కోల్‌కత్తాలో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుండగా తాను ఐపీఎస్‌ ఎంపికైనట్లు వచ్చిన ఆనందం కంటే, తన దత్తత గ్రామం కప్పట్రాళ్లలో మెగా డీఎస్సీలో ఏడుగురు ఉద్యోగాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తనకు మొదట బ్యాంకులో క్లర్క్‌ ఉద్యోగం వచ్చిందని, విధులు నిర్వహిస్తూనే ప్రణాళికతో చదివి విజయం సాధించానన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువు మధ్యలో ఆపకూడదన్నారు. నేడు ఏడుగురు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని, రాబోయే పదేళ్లలో ఈ సంఖ్య వందకు చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా కప్పట్రాళ్ల నుంచి జాతీయ అవార్డులు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

డీఎస్సీలో ఎంపికైన రామకృష్ణ, శ్రీరాములు, రాజేశ్వరి, రామానాయుడు, రామాంజినేయులు, ఉత్తేజ్‌గౌడ్‌, శ్రీరాములు 2018 డీఎస్సీ అభ్యర్ధులు శ్రీరాములు, బడేసాబ్‌ను శాలువా, పూలమాలతో సన్మానించారు. రవికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటుచేసిన కేక్‌ను కట్‌చేశారు. వాల్మీకి చైర్‌పర్సన్‌ బొజ్జమ్మ, సర్పంచ్‌ చెన్నమ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు రూపమ్మ, సీఐ వంశీనాథ్‌, ఏవో అక్భర్‌, గ్రామస్తులు మల్లి కార్జున, చింపిఈరన్న, ఎల్‌ఐసీ రాజు, సేట్రీస్‌ కోఆర్డినేటర్‌ నారాయణ పాల్గొన్నారు.

పట్టుదల ఎక్కువ

కప్పట్రాళ్ల గ్రామస్థులకు పట్టుదల ఎక్కువ. అనుకుంటే ఏదైనా సాధిస్తారు. విద్యలో రాణించి, గ్రామానికి మరింతగా మంచి పేరు తీసుకురావాలి. రవికృష్ణ సార్‌ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తాం. - రాజేశ్వరి, డీఎస్సీ అభ్యర్థి

మార్పు మా నుంచే..

గ్రామాభివృద్ధికి మార్పు అనేది మా నుంచే మొదలు కావాలి. రవికృష్ణ సార్‌ కృషి అభినందనీయం. ఆయన సహకారం మరవలేనిది. గ్రామాభి వృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. -మర్యాద రామకృష్ణ, డీఎస్సీ అభ్యర్థి

Updated Date - Aug 30 , 2025 | 11:48 PM