Share News

బాసర తరహాలో కొలనుభారతి అభివృద్ధి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:41 PM

కొలనుభారతి పుణ్యక్షేత్రాన్ని బాసర తరహాలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పేర్కొన్నారు.

బాసర తరహాలో కొలనుభారతి అభివృద్ధి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

భక్తులకు మెరుగైన సేవలు

శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు

కొత్తపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొలనుభారతి పుణ్యక్షేత్రాన్ని బాసర తరహాలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పేర్కొన్నారు. ఆదివారం శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో కలిసి కొలనుభారతి క్షేత్రాన్ని సందర్శించారు. వీరికి ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానిక సర్పంచ్‌ చంద్రశేఖర్‌ యాదవ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్ర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని కొలనుభారతిని శ్రీశైలంలో విలీనం చేసేందుకు ప్రత్యేక జీవో తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి కోసం సీజీఎస్‌ కింద రూ.1.20కోట్ల నిధులు కూడా ఇప్పటికే మంజూరు అయ్యాయన్నారు. అంతేగాకుండా శివపురం గూడెం నుంచి క్షేత్రం వరకు రహదారి, చారుఘోష నది పునర్నిర్మాణం, ప్రత్యేక అక్షరాభ్యాస కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కొలనుభారతిని ప్రభుత్వం అధికారికంగా శ్రీశైలంలో విలీనం చేయడంతో రాబోయే రోజుల్లో క్షేత్రంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కొలనుభారతి విశిష్టతను తెలిపేందుకు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. శ్రీశైలం నుంచి కూడా క్షేత్రానికి వేద పండితులు వస్తారని, స్థానిక పురోహితులు కూడా ఉంటారనీ స్పష్టంచేశారు. కార్యక్ర మంలో ఈవో రామలింగారెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్‌ వెంకటనాయుడు, కొత్తపల్లి, పగిడ్యాల మండల కన్వీనర్లు లింగస్వామి గౌడు, మహేశ్వరరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి నారపురెడ్డి, సొసైటీ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, నాయకులు మల్లారెడ్డి, రఫీ, జడ్‌.వెంకటరెడ్డి, స్వామిరెడ్డి, శివారెడ్డి, బుచ్చిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారి రామసుబ్బయ్య, పురోహితులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:41 PM