Share News

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:10 AM

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

జిల్లాలో 2,294 పనులకు రూ.2014 కోట్లు మంజూరు

రూ.80 వేల కోట్లతో పోలవరం- బనకచర్ల నిర్మాణం

జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

కల్లూరు, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రూ.678.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, రూ.141 లక్షల రూపాయలతో కర్నూలు-అనుకొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారురోడ్డు, రూ.2250 లక్షల అంచనాతో రెండు వరుసల రహదారిగా వెడల్పు చేసి నిర్మించిన చిన్నటేకూరు-కె. నాగలాపురం-గూడూరు-సి.బెళగళ్‌-ఎమ్మిగనూరు రోడ్‌ ప్రారంభం, రూ.40 లక్షలతో ఎన్‌హెచ్‌ 40 నుండి నన్నూరు ఎస్సీ కాలనీ చర్చి వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శఽంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మాట్లాడుతూ రాష్ర్టానికే కాకుండా యావత్తు భారతదేశానికే తడకనపల్లె ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. జిల్లా అభివృద్ధికి ఆర్‌ ఆండ్‌ బి, పంచాయతీరాజ్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖల ద్వారా 10 నెలల కాలంలోనే 2294 పనులు చేపట్టేందుకు రూ.2014 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.80 వేల కోట్లలతో పోలవరం, బనకచర్ల నిర్మాణం పూర్తి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ దేశంలో 13 పారిశ్రామిక కేంద్రాలను కేంద్రం గుర్తిస్తే ఓర్వకల్లును ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా 2 వేల కోట్లతో పనులు మంజూరు చేయగా అందులో దాదాపు 1600 కోట్లు పాణ్యం నియోజకవర్గంలోని ఈరెండు మండలాల్లో ఉన్నాయన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో 93 శాతం స్ర్టైక్‌రేటుతో 175 సీట్లకు గాను 164 సీట్లను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, కల్లూరు మండల కన్వీనర్‌ డి. రామాంజనేయులు, తడకనపల్లె సర్పంచు సహారాబీ, జుబేదాబీ, కర్నూలు కమిషనర్‌ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:10 AM