Share News

నీటి విడుదలకు నిర్ణయం

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:08 AM

జిల్లాలో ఆయకట్టు రైతులకు తీపి కబురు అందింది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు ఈ నెల 10వ తేది నుంచి, కేసీ కాలువకు 14 నుంచి సాగునీరు ఇవ్వాలని జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ)లో నిర్ణయించారు.

 నీటి విడుదలకు నిర్ణయం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

ఎల్లెల్సీకి 10న , కేసీకి 14న,

హంద్రీ నీవాకు 15న కృష్ణా జలాలు

బి. తాండ్రపాడు గంగమ్మ చెరువుపై తక్షణ చర్యలు చేపట్టండి

కర్నూలు ఆర్డీవోకు కలెక్టర్‌ రంజిత్‌బాషా ఆదేశం

కర్నూలు, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయకట్టు రైతులకు తీపి కబురు అందింది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు ఈ నెల 10వ తేది నుంచి, కేసీ కాలువకు 14 నుంచి సాగునీరు ఇవ్వాలని జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ)లో నిర్ణయించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అధ్యక్షత ఐఏబీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు గౌరు చరితమ్మ, బొగ్గుల దస్తగిరి, డాక్టర్‌ పార్థసారథి, జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. జిల్లాలో తుంగభద్ర జలాశయం, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ముందుగా పాతికేళ్ల తరువాత జూలై మొదటి వారంలో గేట్లు ఎత్తి దిగువకు సాగునీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు ఆశాజనంగా లేకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ముందుగానే జలాశయాలు నిండడం వల్ల ఆయకట్టుకు సాగునీటి విడుదలపై ఐఏబీ సమావేశం నిర్వహించారు. సాగునీటి విడుదలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. నగరంలో హంద్రీ నది మురికి కూపంగా మారిందని, దోమలకు నిలయంగా మారడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చర్చ జరిగింది. మురుగునీరు కొట్టుకుపోయేలా హంద్రీ నీవా కాలువ నుంచి హంద్రీకి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్‌ చేశారు. కలెక్టరు కూడా సానుకూలంగా స్పందించి తీర్మానం చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం, కర్నూలు నగరం సాగునీటికి శాశ్వత పరిష్కారం జరగాలంటే గుండ్రేవుల జలాశయం నిర్మాణం ఒక్కటే ఏకైక మార్గమని ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పరమేశ్వరరెడ్డి గట్టిగా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు వీలుగా తీర్మానం చేశారు. ఇలా పలు అంశాలపై తీర్మానాలు చేశారు.

గంగమ్మ చెరువుపై తక్షణ చర్యలు తీసుకోండి

జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌) తీర్పు కాపీ తెప్పించుకొని బి. తాండ్రపాడు గంగమ్మ చెరువుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా కర్నూలు ఆర్డీఓ కె.సందీప్‌కుమార్‌ను ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత సమస్యగా తీసుకోవాలని స్పష్టం చేశారు. దాదాపు రూ.120 కోట్లు విలువ చేసే గంగమ్మ చెరువు ఫోర్‌షోర్‌ ఏరియాలో 12 ఎకరాలు వైసీపీ హయాంలో అప్పటి పాలకుల అండదండలతో కొందరు ఆక్రమించి ఎర్రమట్టితో పూడ్చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వెంచర్లు వేశారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు.

గంగమ్మ చెరువును కాపాడాలని ఓ మహానాయుకుడు (కర్నూలు మాజీ ఎంపీపీ డి.రాజవర్ధన్‌ రెడ్డి) నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారని, ఆయన మరణాంతరం కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్థన్‌రెడ్డి న్యాయపోరాటం చేశారని గుర్తు చేశారు. సూదీర్ఘ విచారణ తరువాత చెరువు ఆక్రమణలు తొలగించి, చెరువును పునరుద్ధరించాలని గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పు మేరకు తక్షణమే చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, హంద్రీనీవా ఎస్‌ఈ పాండురంగయ్య, ఈఈలు ప్రతాప్‌, భాస్కరరెడ్డి, శ్రీనివాసులు, మల్లికార్జునరెడ్డి, కేసీ కాలువ, ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.

ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి మాట్లాడుతూ.. ఆదోని సబ్‌ డివిజన్‌ మైనర్‌ ఇరిగేషన్‌లో డీఈఈ, నాలుగు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా భర్తీ చేయలేదన్నారు. ఇలాగైతే చెరువుల నిర్వహణ ఎలా ఉంటుందని అధికారులను ఆయన ప్రశ్నించారు.

ఐఏబీ తీర్మానాలు ఇవి

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు ఈ నెల 10 నుంచి నీటిని విడుదల చేయాలని టీబీపీ బోర్డుకు ఇండెంట్‌ పెట్టాలి. 18వ తేది నుంచి పంట కాలువకుల నీటిని విడుదల చేయాలి. ఈ ఏడాది 35 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి.

ఎల్లెల్సీ సరిహద్దులో 550/600 క్యూసెక్కులు నీరు వచ్చేలా ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవిన్యూ అధికారులతో కలసి ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

కేసీ కాలువకు జిల్లాలో 3,763 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ నెల 14 నుంచి సుంకేసుల బ్యారేజీ నుంచి నీటిని ఇవ్వాలి. నంద్యాల ఐఏబీలో తుది నిర్ణయం తీసుకోవాలి.

కర్నూలు నగరంలో హంద్రీ నది మురుగునీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హంద్రీ నీవా కాలువ నాయకల్లు, లద్దగిరి వద్ద రెండు ప్రాంతాల్లో స్లూయిస్‌లు ఏర్పాటు చేసి హంద్రీ నదికి కృష్ణా జలాలు విడుదల చేయాలి. తద్వారా ముగురు లేకుండా చేయాలి.

హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు దృష్ట్యా ఈ నెల 15 నుంచి మాల్యాల లిఫ్టు నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోయాలి. విస్తరణ చేయడంతో 3,850 క్యూసెక్కులు ఎత్తిపోయాలి.

కర్నూలు నగరంలో వేసవి తాగునీటి ఇబ్బందులు దృష్ట్యా హంద్రీనీవా కాలువకు నీటిని ఎత్తిపోసిన నాటి నుంచి గాజులదిన్నె జలాశయానికి నీటిని విడుదల చేసి డ్యాంను నింపాలి. అలాగే.. హంద్రీనీవా, ఎల్లెల్సీ కాలువ కింద చెరువులను పూర్తి స్థాయిలో నింపాలి.

జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు, వలసలు శాశ్వత పరిష్కారానికి గుండ్రేవులు జలాశయం నిర్మాణం ఒక్కకే ఏకైక ఆధారం. గుండ్రేవుల జలాశయం, వేదవతి ప్రాజెక్టులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ నివేదిక పంపించాలి.

Updated Date - Jul 08 , 2025 | 01:08 AM