నిజరూపాలంకరణలో భ్రామరి
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:55 PM
దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని గురువారం చివరి రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.
నందివాహనంపై ఆది దంపతుల విహారం
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
కన్నుల పండువగా తెప్పోత్సవం
శ్రీశైలం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని గురువారం చివరి రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అమ్మవారు భ్రమరాంబదేవి నిజరూపాలం కరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవి అష్ట భుజాలను కలిగి, శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు నందివాహనసేవను అశేష భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం వైభవంగా కొనసాగింది. ఉత్సవాల చివరిరోజు ఉదయం అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, స్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. అనంతరం చండీశ్వరస్వామికి మల్లికార్జున గుండం వద్ద అవబుధస్నానం నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఉన్న శమీ వృక్షానికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. నందివాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లను శమీ వృక్షం వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
నందివాహన సేవ
దసరా ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు అమ్మవారిని నవదుర్గా అలంకరణలలో ఒకటైన భ్రమరాంబాదేవి నిజరూపాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో దేవదాయ శాఖ కార్యదర్శి
శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవిని రాష్ట్ర దేవదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో కార్యదర్శికి ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
వైభవంగా తెప్పోత్సవం: ఆలయ పుష్కరిణిలో సాయంకాలం తెప్పోత్సవం జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను నిర్వహించారు. ఆలయ రాజగోపురం నుంచి ఊరేగింపుగా తొడ్కొని వచ్చి ప్రత్యేక తెప్పపై అధిష్టించారు. మంగళవాయిధ్యాల నడుమ వేదమంత్రాలతో తెప్పోత్సవం వీనులవిందుగా సాగింది. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో తెప్పోత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది.