ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:13 PM
జిల్లాలోని తహ సీల్దార్లు ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా తహసీల్దార్లకు సూచించారు.
తహసీల్దార్లకు కలెక్టర్ సూచన
కర్నూలు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తహ సీల్దార్లు ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా తహసీల్దార్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడి టోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. అధికారులు, ప్రజలతో ఏ విదంగా ప్రవర్తిస్తున్నారనే అంశంపై ఐవీఆర్‌ఎస్ ద్వారా తీసుకున్న సిటిజన్ ఫీడ్ బ్యాక్‌పై చర్చించారు. సి.బెళగల్, గోనెగండ్ల, కోడుమూరు, నందవరం, వెల్దుర్తి, గూడూరు మండలాల తహసీల్దార్లకు సంబంధించి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అధికారులు, ప్రజలతో ఓపికతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేలా కృషి చేసి వారి నుంచి సానుకూల స్పందన పొందాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 12, పత్తికొండ ఆర్డీవో వద్ద 7, కర్నూలు ఆర్డీవో వద్ద 6, కలెక్టరేట్ ఏవో వద్ద 3, సర్వే ఏడీ వద్ద 2, కార్మిక శాఖ, డిస్ర్టిక్ట్ రిజిస్ర్టార్, స్కిల్ డెవలప్‌మెంట్, కర్నూలు మున్సిపల్ కమిషనర్, డీఆర్‌డీవో పీడీ హౌసింగ్ పీడీల వద్ద ఒక్కో దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.