పాలనా సౌలభ్యం కోసమే డీడీవో కార్యాలయాలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:24 PM
గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు సులువైన పాలనా సౌలభ్యం కోసమే డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ సిరి అన్నారు.
కలెక్టర్ సిరి
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు సులువైన పాలనా సౌలభ్యం కోసమే డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్ సిరి అన్నారు. గురువారం చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యంత్రి పవన్‌కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని కలెక్టర్‌తో పాటు పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరుచరిత, బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం డీడీవో కార్యాలయాలను ప్రారంభించిందన్నారు. గ్రామస్థాయిలో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలు ఎన్నో ఉంటాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు డివిజన్ స్థాయిలోనే ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో కర్నూలు, పత్తికొండ, ఆదోని డివిజన్ అభివృద్ధి కార్యాలయాల ద్వారా ప్రజా సమస్యలను అధికారులు వేగంగా పరిష్కరిస్తారన్నారు.
కూటమి ప్రభుత్వంతో పంచాయతీరాజ్ వ్యవస్థకు సర్వాధికారాలు వచ్చాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. కూటమి ప్రభు త్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న 13,226 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు పెట్టి వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానం చేయడం రికార్డు అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కృషి చేస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గ్రామీణ స్థాయిలో సీసీ రోడ్లు, తాగునీరు తదితర పనులు చేపట్టడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జి. నాసరరెడ్డి, డీపీవో భాస్కర్, డీఎల్‌డీవో రమణారెడ్డి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వెంకటరమణయ్య, రమణారెడ్డి, డీఎల్‌పీవో లక్ష్మి, ఎంిపీడీవో రాముడు, అనసూయ, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.