డీసీఎంఎస్ కేంద్రాలకు పూర్వ వైభవం
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:16 AM
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.
కేంద్రాలకు పుష్కలంగా ఎరువులు
మొదటి విడత 500 మెట్రిక్ టన్నులు
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రైతులకు అవసరమైన ఎరువులను డీసీఎంఎస్ కేంద్రాలకు అందించలేదు. మార్క్‌ఫెడ్ సంస్థ నుంచి అందాల్సిన రూ.3 కోట్ల బకాయిలు అందకుండా చేసింది. ఫలితంగా ఐదు నెలలు ఉమ్మడి జిల్లాలోని 17 డీసీఎంఎస్ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది జీతాల్లేక పస్తులతో అలమటించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు పూర్వ వైభవం చేకూరింది. మార్క్‌ఫెడ్ నుంచి బకాయిలు విడుదల కావడంతో ఐదు నెలల జీతాలను ఒకేసారి అందించడంతో ఆ సంస్థ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు డీసీఎంఎస్ కేంద్రాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో సరిపడ ఎరువులు అందించాలని మార్క్‌ఫెడ్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతగా ఉమ్మడి జిల్లాలోని 17 డీసీఎంఎస్ కేంద్రాలకు 500 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు పంపామని డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో రైతులకు డీలర్లు ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ ధర డిమాండ్ చేస్తుండటం వల్ల తీవ్ర ఇబ్బందులకు వారు గురవుతున్నారని ఆయన తెలిపారు. అదే డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ఎరువులను రైతులు కొనుగోలు చేస్తే ఎంఆర్‌పీ ధరకే ఎరువులను వారికి అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ దృష్టితోనే మార్క్‌ఫెడ్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఖరీ్‌ఫలో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎంఆర్‌పీ ధరకే డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ఎరువులు అందిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు.
అన్ని ఎరువులుఅందుబాటులో
ప్రస్తుతం డీసీఎంఎస్ సంస్థ కేంద్రాల్లో ఎరువుల బస్తాలతో కళకళలాడుతున్నాయి. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను మార్క్‌ఫెడ్ సంస్థ ఈ కేంద్రాలకు సప్లయ్ చేస్తుంది. ఎరువుల విక్రయం వల్ల తమకు ఒక బస్తాపై కమిషన్ ప్రభుత్వ నిబంధనల మేరకు అందుతుందని, ఈ కమిషన్ ద్వారా వచ్చే ఆదాయం వల్ల సిబ్బందికి జీతాలు అందించడంతో పాటు డీసీఎంఎస్ సంస్థ బలోపేతానికి చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
డీసీఎంఎ్‌సను బలోపేతం చేస్తాం
గత వైసీపీ ప్రభుత్వం జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థను నిర్వీర్యం చేసింది. అవసరమైన ఎరువులను తమ సంస్థ కేంద్రాలకు అందించకుండా సతాయించింది. దీని వల్ల రైతులు బహిరంగ మార్కెట్‌లో రైతుల నుంచి ఎంఆర్‌పీ ధర కంటే అధిక ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎరువులే కాకుండా వివిధ పంట ఉత్పత్తుల సేకరణకు అవకాశం కల్పించింది.
- వై. నాగేశ్వరరావు యాదవ్, చైర్మన్